మరో 30 స్మార్ట్ సిటీలు
మూడో జాబితా ప్రకటించిన కేంద్రం
కరీంనగర్, అమరావతిలకూ చోటు
అగ్రస్థానంలో తిరువనంతపురం
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా అభివృద్ధిచేసే నగరాల మరో జాబితాను కేంద్రం శుక్రవారం విడుదల చేసింది. తాజాగా ప్రకటించిన మూడో జాబితాలో మొత్తం 30 నగరాలకు చోటు దక్కింది. ఇందులో కేరళ రాజధాని తిరువనంతపురం తొలిస్థానంలో, ఆ తరువాత వరసగా ఛత్తీస్‌గఢ్‌లోని నయారాయ్‌పూర్, గుజరాత్‌లోని రాజ్‌కోట్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కరీంనగర్(తెలంగాణ), ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలకు కూడా స్థానం దక్కింది. పట్టణ పరివర్తన అన్న అంశంపై ఇక్కడ జరిగిన జాతీయ వర్క్‌షాప్ సందర్భంగా పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు ఈ జాబితాను విడుదల చేశారు. దీంతో ఇప్పటి దాకా ప్రకటించిన స్మార్ట్ సిటీల సంఖ్య 90కి చేరింది. 40 స్మార్ట్ సిటీలకుగాను మొత్తం 45 పట్టణాలు పోటీపడ్డాయని, కానీ 30 మాత్రమే ఎంపికయ్యాయని మంత్రి చెప్పారు. తదుపరి దఫాలో 20 పట్టణాల నుంచి 10 స్మార్ట్ సిటీలను ఎంపికచేస్తామని తెలిపారు. తాజాగా ఎంపికైన 30 నగరాల్లో రూ. 57,393 కోట్ల మేర పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. మౌలిక వసతులకు రూ. 46,879 కోట్లు, పాలనాపరమైన సాంకేతిక పరిష్కారాలకు రూ. 10,514 కోట్లు ఇందులో ఉన్నట్లు తెలిపారు. మొత్తం 90 నగరాలకు చెందిన పెట్టుబడి ప్రతిపాదనలు రూ. 1,91,155 కోట్లకు చేరుకున్నాయని వివరించారు.
తాజా జాబితాలోని ఇతర పట్టణాలు
పట్నా, ముజఫర్‌పూర్, పుదుచ్చేరి, గాంధీనగర్, శ్రీనగర్, సాగర్, కర్నల్, సాత్నా, బెంగళూరు, షిమ్లా, డెహ్రాడూన్, తిరుప్తూపర్, పింప్రిచించ్వాడ్, బిలాస్‌పూర్, పాసీఘా ట్, జమ్మూ, దాహోద్, తిరునల్వేలి, తూతుక్కుడి, తిరుచిరాపల్లి, ఝాన్సీ, ఐజ్వాల్, అలహాబాద్, అలీగఢ్, గ్యాంగ్‌టక్.