సాక్షి, అమరావతి: విట్ అమరావతి యూనివర్సిటీలో రెండు బ్లాక్‌లను మంగళవారం ప్రారంభమయ్యాయి. సర్వేపల్లి రాధాకృష్ణ, సరోజినీ నాయుడు బ్లాక్‌లను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ దేవుడు అవకాశం ఇస్తే, నా బాల్యాన్ని తిరిగి ఇవ్వమని కోరుకుంటానన్నారు. అపుడు కేంద్ర మంత్రిగా శంకుస్థాపన చేయగా.. ఇప్పుడు ఉప రాష్ట్రపతిగా ప్రారంభిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. వసతులు, వనరులు కల్పించడమమే కాదు.. విద్యా బుద్దులు కూడా అదేస్థాయిలో విట్ యూనివర్సిటీ అందిస్తుందని నమ్ముతున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో గొప్ప కంపెనీలకు సీఈఓ లుగా దక్షిణ భారతానికి చెందిన వారు ఉండడం మనందరికీ గర్వకారణమన్నారు. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలుగా దేశంలోని యూనివర్సిటీలు మారాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయస్థాయి ర్యాంకింగ్స్‌లో విట్ వర్సిటీ ముందు వరుసలో ఉండడం అభినందనీయమన్నారు.
నాలెడ్జి, హెల్త్ హబ్‌గా అమరావతి
విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్‌గా ఉండబోతోందని చంద్రబాబునాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ రంగంలో తామే ముందున్నామన్నారు. ఆస్తులు మనకు తోడుగా ఉండవు.. చదువే మనకు అన్నీ ఇస్తుందని ఉదహరించారు. ఒక్క సంవత్సరంలో ఈ స్థాయిలో నిర్మాణాలు చేయడం గొప్ప విషయమన్నారు. రాజధాని నిర్మాణ పనులు కూడా ప్రారంభమవుతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌ను బ్రౌన్ ఫీల్డ్ సిటీగా అభివృద్ధి చేశానని, ఇప్పుడు అమరావతిని గ్రీన్, బ్లూ సిటీగా నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రపంచలోని బెస్ట్ యూనివర్సిటీలన్నీ అమరావతికి వస్తాయని, నాలెడ్జి, హెల్త్ హబ్‌గా అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు.
విట్ చైర్మన్ విశ్వనాథన్ మాట్లాడుతూ గత ఏడాది అమరావతిలో విట్ వర్సిటీకి శంకుస్థాపన చేశామని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇంత తక్కువ సమయంలో యూనివర్సిటీని ప్రారంభించగలిగామని చెప్పారు. అమరావతి విట్ యూనివర్సిటీని దేశంలోనే నెంబర్ వన్ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. రాబోయే రోజుల్లో విట్ అమరావతి అద్భుతమైన యూనివర్సిటీగా రూపొందుతుందన్నారు. రాష్ట్ర మంత్రులు అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే శ్రావణ్ తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment