సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న కాలంలో అమరావతిలో భారీ కుంభకోణం జరిగిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు ల్యాండ్‌పూలింగ్ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కున్నారని విమర్శించారు. సింగపూర్ కంపెనీలు వస్తాయని రైతులను మభ్యపెట్టారని పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రాజధానిపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై తీవ్రంగా మండిపడ్డారు. అమరావతిలో రైతులను చూసి భావోద్వేగానికి గురయ్యానన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలపై ప్రకాశ్‌రెడ్డి స్పందించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వలసలు వెళ్తున్న కూలీలపై భావోద్వేగం కలగలేదా..? అని సూటిగా ప్రశ్నించారు.
‘ఒంగోలు ఫ్లొరైడ్ బాధితుల గురించి వెంకయ్య ఎందుకు స్పందించలేదు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహాలో ఇస్తామన్న ప్యాకేజీ ఏమైంది?. కేంద్ర నుంచి వెంకయ్యనాయుడు ఎందుకు ఇప్పించలేకపోయారు. పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు రూ. 30వేల కోట్ల పునారావాస ప్యాకేజీ ఇంకా ఎందుకు మంజూరు కాలేదు. ఆ ప్రాంత రైతులది త్యాగం కాదా?. ఏ ప్రాంత ప్రజలైనా అభివృద్ధినే కోరుకుంటారు. లక్ష కోట్లతో నిర్మించాల్సిన రాజధానికి గత ఐదేళ్లలో కేంద్ర, రాష్ట్రం కలిసి ఖర్చు చేసింది కేవలం రూ. 5వేల కోట్లు మాత్రమే. ఈ విధంగా చేస్తే అమరావతి నిర్మాణం పూర్తి అవ్వాలంటే వందేళ్ల పడుతుంది. వెనుకబాటుతనంతోనే శ్రీకాకుళం, రాయలసీమలో ఉద్యమాలు వచ్చాయి. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్క్ష్యంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment