స్మార్ట్ సిటీల ఎంపికలో రాజకీయం లేదు
న్యూఢిల్లీ : స్మార్ట్ సిటీల ఎంపికలో రాజకీయం లేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికనే స్మార్ట్ సిటీలను ఎంపిక చేశామని ఆయన శనివారమిక్కడ తెలిపారు. స్మార్ట్ సిటీ విధివిధానాలను కేంద్రం రూపొందిస్తుందని, అయితే రాష్ట్రానికే నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తుందన్నారు. స్మార్ట్ సిటీలు, అమృత్ సిటీల నిర్మాణంలో స్థానిక సంస్థలను అనుసంధానం చేయాలని వెంకయ్య అభిప్రాయపడ్డారు.
ఎన్డీయే ప్రభుత్వం తలపెట్టిన స్మార్ట్ సిటీల ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి 5 నగరాలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మొత్తం 100 నగరాలను ఎంపిక చేయగా, వాటిలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే తొమ్మిది ఎంపిక కావటం గమనార్హం. ఏపీ నుంచి చిత్తూరు, కర్నూలు, విజయవాడ, గుంటూరు ఎంపిక కాగా, తెలంగాణ నుంచి హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్లను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది.