2019 నాటికి శాసనసభ స్థానాల పెంపు
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పెంపునకు సంబంధించిన చట్టసవరణ బిల్లు రానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలను పెంచే ప్రక్రియ పూర్తవడానికి సమయం పడుతుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తం 2019 నాటికల్లా పూర్తవుతుందన్నారు. ముందుగా రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు కేంద్రానికి అందాలని, వీటిని కేంద్ర హోం శాఖ, న్యాయశాఖ పరిశీలించిన అనంతరం అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకుంటారని బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆ తరువాత కేబినెట్‌కు న్యాయశాఖ నోట్ పంపితే పార్లమెంటు ముందుకు చట్ట సవరణ బిల్లు వస్తుందని వివరించారు. శాసనసభ స్థానాల పెంపుపై భవిష్యత్తులో కోర్టుల్లో ఎవరూ సవాల్ చేయని విధంగా, పక్కాగా చట్ట సవరణ చేయాల్సి ఉందన్నారు.
చర్చకు ప్రభుత్వం సిద్ధం...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలని వెంకయ్య నాయుడు కోరారు. ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అఖిలపక్ష సమావేశంలో స్వయంగా ప్రధాని మోదీ ఈ విషయాన్ని స్పష్టం చే శారని గుర్తు చేసారు. వర్సిటీల్లో జరుగుతున్న సంఘటనలను ప్రస్తావిస్తూ, అలజడులు సృష్టించేందుకు విద్యార్థుల ముసుగులో కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని ఆరోపించారు. విద్యార్థులను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. అఫ్జల్ గురుకు తగిన న్యాయం జరగలేదని వస్తున్న వాదనలను ఖండిస్తూ అన్ని స్థాయిల్లో విచారణ తర్వాతే అఫ్జల్‌గురుకు శిక్ష ఖరారైందని స్పష్టం చేశారు.