హైదరాబాద్ : స్మార్ట్ సిటీలపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సోమవారం హెచ్ఐసీసీలో రీజనల్ వర్క్ షాప్ ప్రారంభించారు. 12 రాష్ట్రాల నుంచి 40 నగరాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ప్రసంగిస్తూ స్మార్ట్ సిటీల నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేయాలని, వీటి ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.. స్మార్ట్ సిటీల్లో కార్పొరేటర్లు, మేయర్ల పాత్రే కీలకమని వెంకయ్య అన్నారు. దేశంలోని నగరాల పరిస్థితి దారుణంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం సరికాదని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రాలను కేంద్రం ఆదుకుంటుందని, నగరాల అభివృద్ధికి యూజర్ ఛార్జీలు వసూలు చేయక తప్పదని అన్నారు. బలవంతంగా పన్నులు వసూలు చేయమని, సౌకర్యాలు ఎక్కువ కావాలంటే పన్నులు కట్టాల్సిందేనని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఈ వర్క్ షాపుకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఏపీ మంత్రి నారాయణ హాజరయ్యారు.