
సాక్షి, హైదరాబాద్: ఏటా దసరా సందర్భంగా ప్రస్తుత హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆనవాయితీగా నిర్వహించే ‘అలయ్‌బలయ్’ కార్యక్రమం ఈనెల 17న జరగనుంది. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని జలదృశ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదివారం జరిగిన అలయ్‌బలయ్ సన్నాహక సమావేశంలో నిర్ణయించారు. కమిటీ అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి సమావేశం అనంతరం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈసారి అలయ్‌బలయ్ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు.
హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు బిశ్వభూషణ్ హరిచందన్, తమిళిసై సౌందరరాజన్, ఇరు రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్, కేంద్ర కార్మిక శాఖమంత్రి భూపేందర్ యాదవ్, పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డిలతో పాటు పలువురిని ఆహ్వానించనున్నట్లు ఆమె వెల్లడించారు. సమావేశంలో బండారు దత్తాత్రేయ, సభ్యులు జనార్దనరెడ్డి, జిగ్నేశ్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్, సత్యం యాదవ్, మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.