'స్మార్ట్ సిటీల ఎంపిక ఢిల్లీలో జరగలేదు'
న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీల ఎంపికను తాము చేయలేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రపంచ, జర్మనీ బ్యాంకు, ఐఐయూఏ ఎంపిక చేశాయని చెప్పారు. మూడు ప్యానెళ్లు స్మార్ట్ సిటీల ఎంపికను చేపట్టాయని ఆయన తెలిపారు. ఇందులో రాజకీయ పార్టీల జోక్యం ఏమాత్రం లేదని ఆయన అన్నారు. స్మార్ట్ సిటీలకోసం నాడు కేంద్రం కేవలం మార్గదర్శకాలు మాత్రమే జారీ చేసిందని, ఆ సమయంలో స్మార్ట్ సిటీల ఎంపికకోసం పాటించాల్సిన ప్రమాణాలు కూడా చెప్పామని ఆయన తెలిపారు.
మెరిట్ ప్రాతిపదికన నగరాల ఎంపిక జరిగిందని వెంకయ్యనాయుడు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసి విడుదల చేసిన స్మార్ట్ సిటీల జాబితాలో తెలంగాణలోని ఒక్క నగరానికి కూడా చోటుదక్కలేదు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వివరణ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేయడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రిపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు వివరణ ఇచ్చారు.