నా సొంతూరుకే ఇవ్వలేదు ... ఇంకా విజయవాడకా ?
విజయవాడ : ‘నా సొంత నగరం నెల్లూరునే స్మార్ట్ సిటీగా ఎంపిక చేయలేదు. విజయవాడను ఏవిధంగా ఎంపిక చేస్తాం. కేంద్ర పట్టాణాభివృద్ధి శాఖ మంత్రిగా నేను, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ నెల్లూరులోనే ఉన్నాం. అయినా ఆ నగరాన్నే ఎంపిక చేయనప్పుడు విజయవాడ ఎలా అవుతుంది’ అంటూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వ్యగ్యంగా వ్యాఖానించారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో విజయవాడను స్మార్ట్ సిటీగా ఎంపిక చేయకపోవడంపపై విలేకరులు కేంద్ర మంత్రిని ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు.
జీతాలే ఇవ్వలేకపోతున్నారు...
పట్టణాలకు వస్తున్న ఆదాయం, అందిస్తున్న పౌరసేవలు తదితర అంశాలను తీసుకుని ర్యాంకింగ్‌లు ఇచ్చామని, విజయవాడకు ర్యాంకు రాకపోవడం వల్లనే ఎంపిక కాలేదని వివరణ ఇచ్చారు. విజయవాడ కార్పొరేషన్ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో ర్యాంకును మెరుగుపరుచుకుంటే స్మార్ట్ సిటీగా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయంటూ తేల్చి చెప్పారు.
మాటమార్చిన వెంకయ్య...
ఆరు నెలల క్రితం విజయవాడకు వచ్చిన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామంటూ హామీ ఇచ్చారు. కేంద్ర పట్టాభివృద్ధి శాఖ ఆయన చేతిల్లోనే ఉండటంతో నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని నగరవాసులు భావించారు. ఇప్పుడు వెంకయ్యనాయుడు మాట మార్చడంపై పలువురు విస్మయానికి గురవుతున్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదాపైనా అదే తంతు...
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంపైనా వెంకయ్యనాయుడు మాటమార్చారని నగర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత నగరానికి వచ్చిన వెంకయ్యనాయుడు రాష్ట్ర విభజన సమయంలో తాను మాత్రమే రాజ్యసభలో నిలబడి నాటి ప్రధాని మంత్రి మన్‌మోహన్‌సింగ్ చేత రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రకటన చేయించానంటూ చెప్పుకొచ్చారు. యూపీఏ ప్రభుత్వం ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రకటించినందున కేంద్రంలో ఇప్పుడు తమ ప్రభుత్వమే ఉన్నందున రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా వస్తుందంటూ చెప్పడంతో ప్రజలు నమ్మారు.
నెపం యూపీఏపై నెట్టేస్తూ...
అయితే ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వడంపై ఆయన మాటమార్చుతూ యూపీఏ ప్రభుత్వం విభజన బిల్లులో ప్రత్యేక హోదా పెట్టకపోవడం వల్ల ఇవ్వడం సాధ్యపడటం లేదని, తమ వంతు కృషి చేస్తామని చెప్పడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకయ్యనాయుడు వంటి సీనియర్ నేత మాట మార్చడంపై రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.