జీవితంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యం: వెంకయ్య
విజయవాడ: దేశం ముందుకు వెళ్లాలంటే సరైన నాయకత్వం అవసరం అని, అప్పుడే ఆ దేశం శక్తివంతం అవుతుందని ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం ఉదయం వెంకయ్య నాయుడకు విజయవాడలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ....‘ మోదీ రూపంలో దేశానికి సరైన నాయకుడు దొరికారు.2019లో మోదీ మళ్లీ ప్రధాని కావాలన్నదే నా కోరిక. బీజేపీలో దాదాపు అన్ని పదవులు అనుభవించాను. క్రియాశీలక రాజకీయాల నుంచి నన్ను తప్పించారనడం సరికాదు.
Very happy to meet friends, well wishers & party functionaries at a meet & greet organised at The Venue, Vijayawada today pic.twitter.com/w76hTGHvwP
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 29 July 2017
రైతు కుటుంబంలో పుట్టిన నేను చిన్నప్పుడు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాను. మా కుటుంబంలో గాంధీ, నెహ్రూలు ఎవరూ లేరు. విజయవాడతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడే నాకు నాయకత్వ లక్షణాలు వచ్చాయి. అన్నిరంగాలకు విజయవాడ కేంద్రంగా ఉండేది. ఇక నన్ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారని, నా కుటుంబానికి కూడా తెలియదు. జీవితంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యం. విదేశాల్లో ఎవరూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించరు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేవే.’ అని అన్నారు.
వెన్యూ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఆత్మీయ అభినందన కార్యక్రమానికి ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, బీజేపీకి చెందిన రాష్ట్రమంత్రులు కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావు, ఇతర బీజేపీ రాష్ట్ర నేతలు పాల్గొన్నారు. కాగా, అంతకుముందు ఆయన విమానం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వెంకయ్యకు....మంత్రులు కామినేని, మాణిక్యాలరావు తదితరులు స్వాగతం పలికారు.