‘రాష్ట్రపతిగా కాదు.. ఉషాపతిగా చాలు’
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో కొత్త రాష్ట్రపతి అభ్యర్థి విషయంపై పెద్ద మొత్తంలో చర్చ జరుగుతోంది. ఈ చర్చలో భాగంగా బీజేపీ సీనియర్ నేత, కేంద్రంమంత్రి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండొచ్చేమోనని, కనీసం ఉపరాష్ట్రపతి అయిన అవుతారేమోనని మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో వెంకయ్యనాయుడు ఈ ఊహాగానాలపై స్పష్టతను ఇచ్చారు. తాను అసలు రాష్ట్రపతి రేసులో లేనంటూ తనదైన శైలిలో పరోక్షంగా స్పష్టతనిచ్చారు. ‘నాకు రాష్ట్రపతి అవ్వాలని లేదు.. అలాగే ఉప రాష్ట్రపతి అవ్వాలని లేదు. ప్రస్తుతానికి ఉషాపతిగా (వెంకయ్యనాయుడి సతీమణి పేరు ఉష) చాలా సంతోషంగా ఉన్నాను’ అంటూ చమత్కరించారు.
వాస్తవానికి దక్షిణాదిలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అతి ముఖ్యమైనవిగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రాంతాలకు సౌమ్యుడిగా ఉండే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా తెర మీదకు తెస్తే పార్టీకి చాలా ప్రయోజనకరం అని బీజేపీ భావిస్తుందంట. అందులో భాగంగానే ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగానో లేక ఉపరాష్ట్రపతి అభ్యర్థిగానో ప్రకటించే అవకాశాలు లేకపోలేదని మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జూలైలో ముగియనుంది.