Smart cities scheme
-
‘100 స్మార్ట్ సిటీస్’ ఊసేది!?
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ సోమవారం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో ‘100 స్మార్ట్ సిటీస్’ స్కీమ్ ఊసు కూడా లేకపోవడం ఆశ్చర్యం. దేశంలోని అన్ని వంద నగరాలను అన్ని సౌకర్యాలతో అత్యాధునిక నగరాలుగా తీర్చి దిద్దుతామని 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ తెగ ఊదరగొట్టింది. అధికారంలోకి రాగానే ఈ పథకం కోసం మొదటి బడ్జెట్లో 7,060 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. 2015, జూన్ నెలలో ఈ స్కీమ్‌కు శ్రీకారం చుట్టి ఏకంగా 48 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. స్మార్ట్ సిటీ అంటే స్పష్టమైన నిర్వచనం ఇవ్వకపోయినా నీరు, విద్యుత్, పారిశుద్ధ్యం సౌకర్యాలు కల్పించడం, అత్యాధునిక రోడ్డు సౌకర్యాలు కల్పించడం, ఘన వ్యర్థాల నిర్వహణా వ్యవస్థను ఏర్పాటు చేయడం, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చడం, ప్రజలు, ముఖ్యంగా పేదలకు గృహ సౌకర్యం లాంటి మౌలిక సౌకర్యాలను కల్పించడం ఒక అంశం కాగా, నగరమంతా ‘వైఫై’ సేవలు అందుబాటులోకి తేవడం, మెట్రో రవాణా సౌకర్యాలకు మొబైల్ యాప్స్ లేదా జీపీఎస్ వ్యవస్థను అనుసంధానించడం, సీసీటీవీ కెమెరాలతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం రెండో అంశం. వంద స్మార్ట్ సిటీలను ఎంపిక చేసే ప్రక్రియ 2016, సెప్టెంబర్ నెల నుంచి 2018, జనవరి నెలవరకు కొనసాగింది. తొలి విడతగా ఒక్కో నగరానికి 500 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత వంద నగరాలకు సంబంధించి 5,151 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది. 2018, మార్చి నెల నాటికి ఈ పథకం కింద కేటాయించిన నిధుల్లో కేవలం 1.83 శాతం నిధులను మాత్రమే ఖర్చు చేసినట్లు ‘సెంటర్ ఫర్ పాలసీ రీసర్చ్’ తెలిపింది. ఈ స్కీమ్ కింద ‘పోర్ట్‌బ్లేర్’ నగరం అభివృద్ధికి అతి తక్కువగా 777 కోట్ల రూపాయల ప్రతిపాదనలను ఆమోదించింది. అతి ఎక్కువగా చండీగఢ్ నగరం అభివృద్ధికి 5,600 కోట్ల రూపాయల ప్రతిపాదనలను ఆమోదించింది. ముందుగా ఈ స్కీమ్ కింద ప్రతి నగరానికి 500 కోట్ల రూపాయల గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం, దానికి మ్యాచింగ్ గ్రాండ్‌గా మరో 500 రూపాయల గ్రాంట్‌ను విడుదల చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆ తర్వాత ప్రాజెక్టులకయ్యే అదనపు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలే సమకూర్చుకోవాలని కేంద్రం ఆదేశించింది. అందుకు ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం, మున్సిపల్ బాండులు విడుదల చేయడం, ఆర్థిక సంస్థల నుంచి అప్పు తెచ్చుకోవడం, విద్యుత్, నీటి లాంటి ప్రాథమిక సౌకర్యాల యూజర్ చార్జీలను పెంచడం ద్వారా సమకూర్చుకోవాలని కూడా సూచించింది. పర్యవసానంగా ఉదయ్‌పూర్ నగరంలో విద్యుత్, నీటి చార్జీలు ఐదింతలు పెరిగాయి. ఇందుకు ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయింది. 500 కోట్ల రూపాయలను మాత్రమే ఇస్తామని, మిగతా సొమ్మును సొంతంగా సమకూర్చుకోవాలంటూ రాష్ట్రాలను ఆదేశించడంతోనే ఈ పథకం విఫలం అయింది. 2017, ఫిబ్రవరి నాటికి ఆమోదించిన ప్రాజెక్టుల్లో 3 శాతం పూర్తయ్యాయి. 2018, జూలై నెల నాటికి ఆమోదించిన వాటిలో 21.56 శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 2018, డిసెంబర్ నెల నాటికి వాటి సంఖ్య 33 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు అమలు చేసిన ప్రాజెక్టుల వల్ల నగరాల్లోని కొన్ని ప్రాంతాలు మాత్రమే అభివద్ధికి నోచుకున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా స్మార్ట్ సిటీల స్కీమ్ సరిగ్గా అమలు కావడం లేదు. ఈ స్కీమ్ పురోగతిని సమీక్షించిన ‘పట్టణాభివృద్ధి శాఖకు చెందిన పార్లమెంటరీ స్థాయీ సంఘం’ 2018, మార్చి నెల నాటికి ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో 1.83 శాతం నిధులను వినియోగించినట్లు వెల్లడించింది. -
ఆంధ్రాకు 3, తెలంగాణకు 2
* దేశవ్యాప్తంగా స్మార్ట్ నగరాల సంఖ్య ఖరారు * నామినేట్ చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచన * యూపీకి అత్యధికంగా 13, తమిళనాడుకు 12, మహారాష్ట్రకు 10 * ‘అమృత్’ పథకంలో ఏపీకీ 31, తెలంగాణకు 15 పట్టణాల ఎంపిక సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీస్ పథకం ద్వారా అభివృద్ధి చేయనున్న నగరాల ఎంపికకు పేర్లు నామినేట్ చేయాల్సిందిగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్రాలకు సూచించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు, తెలంగాణ నుంచి రెండు నగరాలను నామినేట్ చేయాలని తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కేవలం ఐదు నగరాలకు అవకాశం దక్కగా.. ఉత్తరప్రదేశ్‌కు ఏకంగా 13 నగరాలకు, తమిళనాడుకు 12, మహారాష్ట్రకు 10, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలకు చెరో ఆరు నగరాలను నామినేట్ చేసేందుకు కేంద్రం అవకాశం ఇచ్చింది. స్మార్ట్ సిటీస్ పథకాన్ని ప్రధాని మోదీ ఈ గురువారం ఇక్కడి విజ్ఞాన్ భవన్లో ప్రారంభించనున్నారు. పట్టణ జనాభా, పట్టణ స్థానిక సంస్థల సంఖ్య అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈరెండు అంశాలకు 50:50 నిష్పత్తి చొప్పున వెయిటేజీ ఇచ్చి రాష్ట్రాలకు నామినేట్ చేయాల్సిన సంఖ్యను కేంద్రం సూచించింది. ప్రతి రాష్ట్రానికి, ప్రతి కేంద్ర పాలిత ప్రాంతానికి ఒక స్మార్ట్ సిటీ దక్కేలా నామినేషన్ సంఖ్యను కేటాయించారు. తొలి విడతలో నామినేషన్ల సంఖ్య నిర్ధారించేందుకు ఆయా రాష్ట్రాల్లోని నగరాలు అంతర్గతంగా పోటీపడగా.. రెండో దశలో ఇతర రాష్ట్రాల నగరాలతో పోటీపడనున్నాయి. ఈ వంద స్మార్ట్ నగరాల ఎంపిక అనంతరం అవి తగిన ప్రణాళికలు రూపొందిస్తాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, నిపుణుల బృందం, రాష్ట్రాలు కలిసి ప్రణాళిక రచిస్తాయి. ఈ వంద నగరాల్లో ప్రతిభా క్రమంలో వచ్చిన టాప్-20 నగరాలకు 2015-16 ఆర్థిక సంవత్సరంలోనే నిధులు కేటాయిస్తారు. మరో 40 నగరాలకు 2016-17లో నిధులు కేటాయిస్తారు. తదుపరి సంవత్సరం మరో 40 నగరాలకు నిధులు కేటాయిస్తారు. 70 శాతం స్మార్ట్ నగరాలు 12 రాష్ట్రాలలోనే(యూపీ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఎంపీ, కర్ణాటక, ఏపీ, రాజస్థాన్, పంజాబ్, హరియాణ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్) అభివృద్ధి చెందనున్నాయి. వీటిలో 8 బీజేపీ, దాని మిత్రపక్షాల పాలిత రాష్ట్రాలు.‘అమృత్’ పథకంలో కూడా అభివృద్ధి చేయనున్న 476 పట్టణాల్లో 225 ఈ 12 రాష్ట్రాలలోనే ఉండటం గమనార్హం. ‘అమృత్’లో తెలుగు రాష్ట్రాలకు 46 అటల్ పట్టణ నవీకరణ పథకం(అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్) కింద రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 46 నగరాలను కేంద్రం ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 31, తెలంగాణ నుంచి 15 నగరాలను ఈ పథకం కింద అభివృద్ధి చేయనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 4,041 పట్టణ స్థానిక సంస్థలు పనిచేస్తున్నాయి. ఇందులో దాదాపు 500 పై చిలుకు నగరాలు ఒక లక్ష కంటే అధికంగా ఉన్నాయి. దేశంలోని 73 శాతం పట్టణ జనాభా ఈ 500 పట్టణాల్లోనే ఉంది. అందుకే ఈ పట్టణాల అభివృద్ధికి సంబంధించిన ఈ అమృత్ పథకాన్ని కూడా ప్రధాని గురువారం నాడే ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు 476 పట్టణాలను ఎంపిక చేశారు. మరో 24 పట్టణాలను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే, లక్ష జనాభా కంటే తక్కువగా ఉన్నప్పటికీ వాటికున్న ప్రత్యేకతల్ని బట్టి పర్వత ప్రాంత పట్టణాలు, పర్యాటక ప్రాముఖ్యత, గంగా నది పరిసరాల్లో ఉన్న పట్టణాలనూ ఈ జాబితాలో ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ ‘అమృత్’ పట్టణాలు (31) 1. గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్, 2. విజయవాడ, 3. గుంటూరు 4. నెల్లూరు, 5. కర్నూలు, 6. రాజమండ్రి, 7. తిరుపతి, 8. కాకినాడ 9. కడప, 10. అనంతపురం, 11. విజయనగరం, 12. ఏలూరు 13. ప్రొద్దుటూరు, 14. నంద్యాల, 15. ఒంగోలు, 16. ఆదోనీ, 17. మదనపల్లె 18. చిత్తూరు, 19. మచిలీపట్నం, 20. తెనాలి, 21. చీరాల 22. హిందూపురం, 23. శ్రీకాకుళం, 24. భీమవరం, 25. ధర్మవరం 26. గుంతకల్లు, 27. గుడివాడ, 28. నర్సరావుపేట, 29. తాడిపత్రి 30. తాడేపల్లి గూడెం, 31. చిలకలూరిపేట తెలంగాణలో ‘అమృత్’(15) 1. హైదరాబాద్, 2. వరంగల్, 3. నిజామాబాద్, 4. కరీంనగర్, 5. ఖమ్మం, 6. రామగుండం, 7. మహబూబ్‌నగర్, 8. మంచిర్యాల, 9. నల్లగొండ, 10. ఆదిలాబాద్, 11. కొత్తగూడెం, 12. సిద్దిపేట, 13. సూర్యాపేట, 14. మిర్యాలగూడ , 15. జగిత్యాల -
కఠిన నిర్ణయాలతోనే ‘స్మార్ట్’
* స్మార్ట్ సిటీల పథకంపై కేంద్ర మంత్రి వెంకయ్య * పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలి * స్మార్ట్ సిటీల జాతీయ సదస్సులో పిలుపు సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం చేపట్టిన ‘వంద స్మార్ట్ సిటీల’ పథకంలో చోటు ఆశిస్తున్న నగరాలకు అభివృద్ధి కోసం కఠిన నిర్ణయాలు తీసుకోగల సంసిద్ధత ఉండాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ‘సౌకర్యవంతమైన జీవనం, మెరుగైన జీవన ప్రమాణాలు, సుపరిపాలన, చక్కటి ఆరోగ్య, విద్యా సేవలు, రోజూ 24 గంటల విద్యుత్, నీరు, నాణ్యమైన రవాణా, పారిశుద్ధ్యం, ఉపాధి, సైబర్ అనుసంధానం అందించడం ఈ సిటీల ఉద్దేశం’ అని పేర్కొన్నారు. శుక్రవారమిక్కడ స్మార్ట్ సీటీల పథకంపై జరిగిన జాతీయ సదస్సులో వెంకయ్య ప్రసంగించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పట్టణాభివృద్ధి మంత్రులు, కార్యదర్శులు పాల్గొన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూపొందించిన స్మార్ట్ సిటీల ముసాయిదాపై చర్చించారు. వెంకయ్య మాట్లాడుతూ.. ‘ఈ సిటీలకు జాగరూకతగల, సేవలకు డబ్బు చెల్లించగల పౌరులు, సమర్థ నాయకత్వం, జవాబుదారీతనం గల సుపరిపాలన అవసరం. ఇవన్నీ సమకూరితేనే పథకం విజయవంతమవుతుంది. సమర్థవంతమైన పట్టణ పరిపాలనకు.. సేవల ధరలను పెంచగల, సంస్కరణలను అమలు చేయగల, అక్రమ కట్టడాలను నిర్మూలించి, కబ్జాలను అరిక ట్టే నాయకత్వం కావాలి’ అని అన్నారు. దేశంలో ప్రస్తుతం 37 కోట్ల మంది పట్టణాల్లో నివసిస్తున్నారని, వచ్చే 15 ఏళ్లలో వీరి జనాభా మరో 15 కోట్లకు, 2050 నాటికి మరో 50 కోట్లు పెరుగుతుందని వివరించారు. పట్టణ సంస్థల రాజకీయ నాయకత్వం సరైన వనరులు సమకూర్చకపోవడంతో జవహర్లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ పథకం విఫలమైందని, స్మార్ట్ సిటీల పథకంలో ఇలాంటి వాటిని సహించబోమని అన్నారు. ఈ సిటీల పథకం ముసాయిదాపై రాష్ట్రాలు వారం రోజుల్లో అభిప్రాయాలను పంపాలన్నారు. ముసాయిదా పత్రంలోని ముఖ్యాంశాలు.. - ఈ నగరాల్లో 20 ఏళ్లపాటు తలసరి పెట్టుబడి వ్యయం రూ. 43,386 గా అత్యున్నతాధికార నిపుణుల కమిటీ(హెచ్‌పీఈసీ) అంచనా వేసింది. నీటి సరఫరా, రవాణా తదితరాల పెట్టుబడులన్నీ ఇందులో ఉన్నాయి. వంద స్మార్ట్ సిటీల్లో 10 లక్షల జనాభాను సగటుగా లెక్కించి మదింపు చేశారు. అంటే 100 నగరాల్లో 20 ఏళ్ల పాటు రూ. 7లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలి. - పారిశ్రామిక వాడలు, ఎగుమతుల జోన్లు, వాణిజ్య, సేవల కేంద్రాలు, ఫైనాన్షియల్ కేంద్రాల ద్వారా ఆర్థికవృద్ధి సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తారు. - పథకం విజయవంతం కావడానికి అభివృద్ధి ప్రాణాళికలు రూపొందిస్తారు. దీనికి రూ. 5 వేల కోట్లు కావాలి. - 13 అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. వీటిలో రవాణా, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యర్థపదార్థాల నిర్వహణ, మురుగునీటి కాల్వలు, టెలిఫోన్ నెట్వర్క్, వైఫై, ఆరోగ్యం, విద్య, అగ్నిమాపక నిర్వహణ తదితరాలు వీటిలో ఉన్నాయి.