సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ సోమవారం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో ‘100 స్మార్ట్ సిటీస్’ స్కీమ్ ఊసు కూడా లేకపోవడం ఆశ్చర్యం. దేశంలోని అన్ని వంద నగరాలను అన్ని సౌకర్యాలతో అత్యాధునిక నగరాలుగా తీర్చి దిద్దుతామని 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ తెగ ఊదరగొట్టింది. అధికారంలోకి రాగానే ఈ పథకం కోసం మొదటి బడ్జెట్‌లో 7,060 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. 2015, జూన్ నెలలో ఈ స్కీమ్‌కు శ్రీకారం చుట్టి ఏకంగా 48 వేల కోట్ల రూపాయలను కేటాయించింది.
స్మార్ట్ సిటీ అంటే స్పష్టమైన నిర్వచనం ఇవ్వకపోయినా నీరు, విద్యుత్, పారిశుద్ధ్యం సౌకర్యాలు కల్పించడం, అత్యాధునిక రోడ్డు సౌకర్యాలు కల్పించడం, ఘన వ్యర్థాల నిర్వహణా వ్యవస్థను ఏర్పాటు చేయడం, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చడం, ప్రజలు, ముఖ్యంగా పేదలకు గృహ సౌకర్యం లాంటి మౌలిక సౌకర్యాలను కల్పించడం ఒక అంశం కాగా, నగరమంతా ‘వైఫై’ సేవలు అందుబాటులోకి తేవడం, మెట్రో రవాణా సౌకర్యాలకు మొబైల్ యాప్స్ లేదా జీపీఎస్ వ్యవస్థను అనుసంధానించడం, సీసీటీవీ కెమెరాలతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం రెండో అంశం. వంద స్మార్ట్ సిటీలను ఎంపిక చేసే ప్రక్రియ 2016, సెప్టెంబర్ నెల నుంచి 2018, జనవరి నెలవరకు కొనసాగింది. తొలి విడతగా ఒక్కో నగరానికి 500 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత వంద నగరాలకు సంబంధించి 5,151 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది.
2018, మార్చి నెల నాటికి ఈ పథకం కింద కేటాయించిన నిధుల్లో కేవలం 1.83 శాతం నిధులను మాత్రమే ఖర్చు చేసినట్లు ‘సెంటర్ ఫర్ పాలసీ రీసర్చ్’ తెలిపింది. ఈ స్కీమ్ కింద ‘పోర్ట్‌బ్లేర్’ నగరం అభివృద్ధికి అతి తక్కువగా 777 కోట్ల రూపాయల ప్రతిపాదనలను ఆమోదించింది. అతి ఎక్కువగా చండీగఢ్ నగరం అభివృద్ధికి 5,600 కోట్ల రూపాయల ప్రతిపాదనలను ఆమోదించింది. ముందుగా ఈ స్కీమ్ కింద ప్రతి నగరానికి 500 కోట్ల రూపాయల గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం, దానికి మ్యాచింగ్ గ్రాండ్‌గా మరో 500 రూపాయల గ్రాంట్‌ను విడుదల చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆ తర్వాత ప్రాజెక్టులకయ్యే అదనపు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలే సమకూర్చుకోవాలని కేంద్రం ఆదేశించింది. అందుకు ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం, మున్సిపల్ బాండులు విడుదల చేయడం, ఆర్థిక సంస్థల నుంచి అప్పు తెచ్చుకోవడం, విద్యుత్, నీటి లాంటి ప్రాథమిక సౌకర్యాల యూజర్ చార్జీలను పెంచడం ద్వారా సమకూర్చుకోవాలని కూడా సూచించింది. పర్యవసానంగా ఉదయ్‌పూర్ నగరంలో విద్యుత్, నీటి చార్జీలు ఐదింతలు పెరిగాయి. ఇందుకు ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయింది. 500 కోట్ల రూపాయలను మాత్రమే ఇస్తామని, మిగతా సొమ్మును సొంతంగా సమకూర్చుకోవాలంటూ రాష్ట్రాలను ఆదేశించడంతోనే ఈ పథకం విఫలం అయింది.
2017, ఫిబ్రవరి నాటికి ఆమోదించిన ప్రాజెక్టుల్లో 3 శాతం పూర్తయ్యాయి.
2018, జూలై నెల నాటికి ఆమోదించిన వాటిలో 21.56 శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయి.
2018, డిసెంబర్ నెల నాటికి వాటి సంఖ్య 33 శాతానికి పెరిగింది.
ఇప్పటి వరకు అమలు చేసిన ప్రాజెక్టుల వల్ల నగరాల్లోని కొన్ని ప్రాంతాలు మాత్రమే అభివద్ధికి నోచుకున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా స్మార్ట్ సిటీల స్కీమ్ సరిగ్గా అమలు కావడం లేదు. ఈ స్కీమ్ పురోగతిని సమీక్షించిన ‘పట్టణాభివృద్ధి శాఖకు చెందిన పార్లమెంటరీ స్థాయీ సంఘం’ 2018, మార్చి నెల నాటికి ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో 1.83 శాతం నిధులను వినియోగించినట్లు వెల్లడించింది.
అటకెక్కిన ‘100 స్మార్ట్ సిటీస్’ స్కీమ్!
Published Tue, Apr 9 2019 3:48 PM | Last Updated on Tue, Apr 9 2019 5:47 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment