ఆంధ్రాకు 3, తెలంగాణకు 2
* దేశవ్యాప్తంగా స్మార్ట్ నగరాల సంఖ్య ఖరారు
* నామినేట్ చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచన
* యూపీకి అత్యధికంగా 13, తమిళనాడుకు 12, మహారాష్ట్రకు 10
* ‘అమృత్’ పథకంలో ఏపీకీ 31, తెలంగాణకు 15 పట్టణాల ఎంపిక
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీస్ పథకం ద్వారా అభివృద్ధి చేయనున్న నగరాల ఎంపికకు పేర్లు నామినేట్ చేయాల్సిందిగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్రాలకు సూచించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు, తెలంగాణ నుంచి రెండు నగరాలను నామినేట్ చేయాలని తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కేవలం ఐదు నగరాలకు అవకాశం దక్కగా.. ఉత్తరప్రదేశ్‌కు ఏకంగా 13 నగరాలకు, తమిళనాడుకు 12, మహారాష్ట్రకు 10, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలకు చెరో ఆరు నగరాలను నామినేట్ చేసేందుకు కేంద్రం అవకాశం ఇచ్చింది. స్మార్ట్ సిటీస్ పథకాన్ని ప్రధాని మోదీ ఈ గురువారం ఇక్కడి విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభించనున్నారు. పట్టణ జనాభా, పట్టణ స్థానిక సంస్థల సంఖ్య అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈరెండు అంశాలకు 50:50 నిష్పత్తి చొప్పున వెయిటేజీ ఇచ్చి రాష్ట్రాలకు నామినేట్ చేయాల్సిన సంఖ్యను కేంద్రం సూచించింది. ప్రతి రాష్ట్రానికి, ప్రతి కేంద్ర పాలిత ప్రాంతానికి ఒక స్మార్ట్ సిటీ దక్కేలా నామినేషన్ సంఖ్యను కేటాయించారు. తొలి విడతలో నామినేషన్ల సంఖ్య నిర్ధారించేందుకు ఆయా రాష్ట్రాల్లోని నగరాలు అంతర్గతంగా పోటీపడగా.. రెండో దశలో ఇతర రాష్ట్రాల నగరాలతో పోటీపడనున్నాయి. ఈ వంద స్మార్ట్ నగరాల ఎంపిక అనంతరం అవి తగిన ప్రణాళికలు రూపొందిస్తాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, నిపుణుల బృందం, రాష్ట్రాలు కలిసి ప్రణాళిక రచిస్తాయి. ఈ వంద నగరాల్లో ప్రతిభా క్రమంలో వచ్చిన టాప్-20 నగరాలకు 2015-16 ఆర్థిక సంవత్సరంలోనే నిధులు కేటాయిస్తారు. మరో 40 నగరాలకు 2016-17లో నిధులు కేటాయిస్తారు. తదుపరి సంవత్సరం మరో 40 నగరాలకు నిధులు కేటాయిస్తారు. 70 శాతం స్మార్ట్ నగరాలు 12 రాష్ట్రాలలోనే(యూపీ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఎంపీ, కర్ణాటక, ఏపీ, రాజస్థాన్, పంజాబ్, హరియాణ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్) అభివృద్ధి చెందనున్నాయి. వీటిలో 8 బీజేపీ, దాని మిత్రపక్షాల పాలిత రాష్ట్రాలు.‘అమృత్’ పథకంలో కూడా అభివృద్ధి చేయనున్న 476 పట్టణాల్లో 225 ఈ 12 రాష్ట్రాలలోనే ఉండటం గమనార్హం.
‘అమృత్’లో తెలుగు రాష్ట్రాలకు 46
అటల్ పట్టణ నవీకరణ పథకం(అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫార్మేషన్) కింద రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 46 నగరాలను కేంద్రం ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 31, తెలంగాణ నుంచి 15 నగరాలను ఈ పథకం కింద అభివృద్ధి చేయనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 4,041 పట్టణ స్థానిక సంస్థలు పనిచేస్తున్నాయి. ఇందులో దాదాపు 500 పై చిలుకు నగరాలు ఒక లక్ష కంటే అధికంగా ఉన్నాయి. దేశంలోని 73 శాతం పట్టణ జనాభా ఈ 500 పట్టణాల్లోనే ఉంది. అందుకే ఈ పట్టణాల అభివృద్ధికి సంబంధించిన ఈ అమృత్ పథకాన్ని కూడా ప్రధాని గురువారం నాడే ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు 476 పట్టణాలను ఎంపిక చేశారు. మరో 24 పట్టణాలను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే, లక్ష జనాభా కంటే తక్కువగా ఉన్నప్పటికీ వాటికున్న ప్రత్యేకతల్ని బట్టి పర్వత ప్రాంత పట్టణాలు, పర్యాటక ప్రాముఖ్యత, గంగా నది పరిసరాల్లో ఉన్న పట్టణాలనూ ఈ జాబితాలో ఎంపిక చేశారు.
ఆంధ్రప్రదేశ్ ‘అమృత్’ పట్టణాలు (31)
1. గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్, 2. విజయవాడ, 3. గుంటూరు
4. నెల్లూరు, 5. కర్నూలు, 6. రాజమండ్రి, 7. తిరుపతి, 8. కాకినాడ
9. కడప, 10. అనంతపురం, 11. విజయనగరం, 12. ఏలూరు
13. ప్రొద్దుటూరు, 14. నంద్యాల, 15. ఒంగోలు, 16. ఆదోనీ, 17. మదనపల్లె
18. చిత్తూరు, 19. మచిలీపట్నం, 20. తెనాలి, 21. చీరాల
22. హిందూపురం, 23. శ్రీకాకుళం, 24. భీమవరం, 25. ధర్మవరం
26. గుంతకల్లు, 27. గుడివాడ, 28. నర్సరావుపేట, 29. తాడిపత్రి
30. తాడేపల్లి గూడెం, 31. చిలకలూరిపేట
తెలంగాణలో ‘అమృత్’(15)
1. హైదరాబాద్, 2. వరంగల్,
3. నిజామాబాద్, 4. కరీంనగర్,
5. ఖమ్మం, 6. రామగుండం,
7. మహబూబ్‌నగర్, 8. మంచిర్యాల,
9. నల్లగొండ, 10. ఆదిలాబాద్,
11. కొత్తగూడెం, 12. సిద్దిపేట,
13. సూర్యాపేట, 14. మిర్యాలగూడ ,
15. జగిత్యాల