స్మార్ట్‌సిటీలో భాగంగా ఆధునికీకరించిన నగరంలోని ఓ జంక్షన్
కరీంనగర్: ఇప్పటికే భూ ఆక్రమణల విచారణతో అతలాకుతమవుతున్న నగరపాలకసంస్థకు పులిమీద పుట్రలా స్మార్ట్‌సిటీ విచారణ వచ్చి పడనుంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో స్మార్ట్‌సిటీ నిధులతో నగర రూపురేఖలు మారేలా అభివృద్ధి పనులు జరగడం తెలిసిందే. ఈ పనుల్లో కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించారంటూ గతంలోనే అనేక ఫిర్యాదులు వెల్లువెతాయి. తాజాగా స్మార్ట్‌సిటీ పనుల్లో అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తామన్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటనతో అధికారుల్లో గుబులు మొదలైంది.
నగరపాలక అధికారుల్లో గుబులు..
స్మార్ట్‌సిటీ పనులపై విచారణ అంటేనే అధికారుల్లో వణుకుపుడుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్మార్ట్‌సిటీ పనుల్లో అక్రమాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. తొలుత హౌసింగ్‌బోర్డుకాలనీ తదితర ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు విచారణ జరిపినప్పటికీ, పూర్తిస్థాయిలో మాత్రం దృష్టి పెట్ట లేదు. కేవలం వ్యక్తిగత ఫిర్యాదుల ఆధారంగానే విచారణ సాగినట్లు సమాచారం.
తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్మార్ట్‌సిటీ అక్రమాలపై విచారణ జరిపిస్తామని మరోసారి వెల్లడించడం హాట్‌టాపిక్‌గా మారింది. మొత్తం పనులపై విచారణ జరిపితే, చాలా విషయాలు బయటకు రానున్నాయి. దీంతో సాంకేతికంగా బాధ్యులుగా తేలే చాన్స్ నగరపాలకసంస్థ అధికారులకే ఉండడంతో, ఈ విచారణ వారి మెడకు చుట్టుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే భూ ఆక్రమణలకు సంబంధించి నగరపాలకసంస్థ రెవెన్యూ విభాగం అధికారుల పాత్రపై పోలీసులు ఆరా తీస్తుండగా, మరో వైపు స్మార్ట్‌సిటీ పనులపైనా విచారణ జరిగితే కొంతమంది ఇంజినీరింగ్ అధికారుల అక్రమాల బాగోతం బయటపడనుంది. మరికొద్ది రోజుల్లో విచారణపై స్పష్టత రానుంది.
రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి
స్మార్ట్‌సిటీ జాబితాలో చోటులభించడంతో కరీంనగర్ నగరపాలకసంస్థకు నిధుల వరద వచ్చి పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాన భాగస్వామ్యంతో రూ.వెయ్యి కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పటికే రూ.740 కోట్లు విడుదల కాగా, ఇందులో రూ.539 కోట్లు చెల్లించారు. మరో రూ.200 కోట్లు చెల్లించాల్సి ఉంది. స్మార్ట్‌సిటీ కింద చేపట్టిన రోడ్లు, డ్రైనేజీలు, ఫుట్‌పాత్‌లు, స్మార్ట్ వీధిదీపాలు, నిర్మాణం దాదాపు పూర్తయింది. కొన్ని కూడళ్ల నిర్మాణం పూర్తి కాగా, మరికొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. ఇక కమాండ్ కంట్రోల్, లైబ్రరీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాలు, పార్క్‌లు తదితర అభివృద్ధి పనులు కూడా పూర్తి కావాల్సి ఉంది.
ఇష్టారీతిన అంచనాలు..
రూ.వందలకోట్లతో చేపట్టిన స్మార్ట్‌సిటీ పనుల్లో కొంతమంది నగరపాలకసంస్థ అధికారులు కాంట్రాక్టర్లతో కలిసి చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా గతంలో బల్దియాలో అంతా తానై వ్యవహరించిన ఓ ఇంజినీరింగ్ అధికారి కనుసన్నల్లో చేసిన అంచనాలే తప్పినట్లు ఫిర్యాదులు వచ్చాయి.
అభివృద్ధి పనులకు సంబంధించిన అంచనాలను ఇష్టారీతిన పెంచి, స్మార్ట్‌సిటీ నిధులను కాంట్రాక్టర్ల జేబుల్లోకి మళ్లించినట్లు అభియోగాలున్నాయి. రూ.50 లక్షలతో పూర్తయే జంక్షన్ పనికి, రూ.కోటికి పైగా బిల్లు చేసిన వైనం నగరపాలకసంస్థ ఉన్నతాధికారులను విస్మయానికి గురిచేసింది. వ్యవసాయ మార్కెట్ ఆవరణలో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ భవన నిర్మాణంలోనూ అంచనాలు, బిల్లులపై అనేక ఆరోపణలు వచ్చాయి.
లెస్ క్వాలిటీ..
నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌సిటీ పనుల్లో నాణ్యతా లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. తమ లాభాల కోసం అంచనాలు భారీగా పెంచినప్పటికీ, చేసిన పనుల్లో నాణ్యత పాటించకపోవడంతో వాటి మనుగడ కష్టంగా మారింది. కలెక్టరేట్ రోడ్డు, హౌసింగ్‌బోర్డు కాలనీ, అంబేడ్కర్ స్టేడియం, టవర్‌సర్కిల్ తదితర ప్రాంతాల్లో నాణ్యతా లోపాలు బయటపడ్డాయి.
సీసీరోడ్డు కుంగిపోగా, డ్రైనేజీలు నిర్మాణంలోనే కూలిపోయాయి. ఫుట్‌పాత్‌లైతే చెప్పాల్సిన అవసరం లేదు. నగరంలో ఫుట్‌పాత్‌లపై వేసిన టైల్స్ 90 శాతం సక్రమంగా లేవు. టవర్‌సర్కిల్ వద్ద డ్రైనేజీల నుంచి ఫుట్‌పాత్‌ల మీదుగా వచ్చే వరదనీళ్లు ఫౌంటేన్‌ల మాదిరిగా మారాయి. కూడళ్లకు వినియోగించిన మెటీరియల్ కూడా నాసిరకం వాడారనే ఆరోపణలున్నాయి. ఎక్కడో ఒకటి అరా తప్ప దాదాపు అన్ని పనుల్లో నాణ్యతా ప్రమాణాలు అంతంతమాత్రంగానే ఉన్నాయనే ఫిర్యాదులున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment