ఎస్బీఐ నుంచి స్మార్ట్ ప్రివిలేజ్ పాలసీ...
హైదరాబాద్: అధిక నెట్వర్త్ కలిగిన వ్యక్తుల (హెచ్ఎన్ఐ) కోసం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ‘స్మార్ట్ ప్రివిలేజ్’ పేరుతో యూనిట్ ఆధారిత జీవిత బీమా పాలసీని ప్రవేశపెట్టింది. పాలసీదారులు తమ అవసరాలకు అనుగుణంగా 8 రకాల ఫండ్లలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఫండ్ల మధ్య స్విచ్చింగ్ (మార్పిడి), ప్రీమియం మార్పిడిని పాలసీ కాల వ్యవధిలో ఎన్ని సార్లయినా చేసుకునే వీలుంది. ఒకే విడత ప్రీమియం, పరిమిత కాల ప్రీమియం లేదా పాలసీ కాల వ్యవధి వరకు ప్రీమియం చెల్లించే సౌలభ్యం ఉంది. పాలసీ తీసుకునేందుకు కనీస వయసు 8 నుంచి 13 సంవత్సరాలు.
గరిష్ట వయసు 55 సంవత్సరాలు. అలాగే, పాలసీ కాల వ్యవధి 5 నుంచి 30 సంవత్సరాలుగా ఉంది. పాలసీ కాల వ్యవధిలో మరణం సంభవిస్తే ఫండ్ విలువ లేదా బీమా ఏది ఎక్కువైతే అది చెల్లిస్తారు. గడువు తీరే వరకూ జీవించి ఉంటే ఫండ్ విలువను చెల్లిస్తారు. కావాలంటే దీన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా తీసుకోవచ్చు.