Sneha Chicken
-
రూ.100 కోట్లతో స్నేహా ఫామ్స్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పౌల్ట్రీ రంగ సంస్థ స్నేహా ఫామ్స్ తన సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ప్రాసెసింగ్ కెపాసిటీ గంటకు 6,000 బర్డ్స్ నుంచి 12,000లకు చేర్చనుంది. అలాగే కోల్డ్ స్టోరేజీ సామర్థ్యం ప్రస్తుతం 2,000 టన్నులుంది. దీనికి 3,000 టన్నులకు పెంచనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకల్ వద్ద కంపెనీకి ప్రాసెసింగ్ ప్లాంటుతోపాటు శీతల గిడ్డంగి ఉంది. సంస్థ ఇప్పటికే ప్రాసెస్డ్ చికెన్, ఫ్రెష్ చికెన్ విక్రయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తొలి స్థానంలో నిలిచింది. అలాగే ప్రాసెసింగ్ కెపాసిటీ పరంగా దేశంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఎనిమిది నెలల్లో ఈ విస్తరణ పూర్తి అవుతుందని స్నేహా ఫామ్స్ ఎండీ డి.రామ్ రెడ్డి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. నూతన విభాగాల్లోకి ప్రవేశించేందుకు తాజా విస్తరణ దోహదం చేస్తుందన్నారు. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. మెగా ప్రాజెక్టు కింద తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి పొందామని చెప్పారు. కొత్త విభాగాల్లోకి స్నేహా... స్నేహా ఫామ్స్ త్వరలో నగ్గెట్స్, లాలీపాప్స్ వంటి రెడీ టు కుక్, చికెన్ కర్రీ వంటి ఉత్పత్తులతో రెడీ టు ఈట్ విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే అయిదారు ఉత్పత్తులతో ట్రయల్స్ నిర్వహించామని రామ్‌రెడ్డి తెలిపారు. ‘ఫ్రోజెన్ చికెన్ విభాగంలోకి కూడా వస్తున్నాం. రెడీ టు ఈట్ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తాం. ఇప్పటికే దాణాను ఎగుమతి చేస్తున్నాం. సఫల బ్రాండ్ కింద సోయా, రైస్ బ్రాన్ ఆయిల్స్ దేశీయంగా విక్రయిస్తున్నాం. 80,000 కిలోల ప్రాసెస్డ్ చికెన్, 2.5 లక్షల బ్రాయిలర్ కోళ్లు ప్రతిరోజు అమ్ముతున్నాం. గ్రూప్ టర్నోవర్ రూ.3,000 కోట్లుంది. ఇందులో స్నేహా ఫామ్స్ వాటా రూ.2,500 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్‌లో 15–20 శాతం వృద్ధి ఆశిస్తున్నాం. 3,000 మంది ఉద్యోగులు ఉన్నారు. విస్తరణతో కొత్తగా 500 మందికి ఉపాధి లభిస్తుంది’ అని వివరించారు. -
‘రెడీ టు ఈట్’లోకి స్నేహ ఫామ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పౌల్ట్రీ రంగంలో ఉన్న స్నేహ ఫామ్స్ రెడీ టు ఈట్ విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.60 కోట్లతో ప్రాసెసింగ్ ప్లాంట్‌ను నెలకొల్పుతోంది. 6 నెలల్లో ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. గంటకు 6,000 కోళ్లను ప్రాసెస్ చేయగల సామర్థ్యం దీనికి ఉంది. భారత్‌లో ఉన్న అతికొద్ది అత్యాధునిక ప్లాంట్లలో ఇది ఒకటని స్నేహ ఫామ్స్ ఎండీ డి.రామ్‌రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. చిల్డ్, ఫ్రోజెన్, కట్ పీసెస్, రెడీ టు ఈట్ ఉత్పత్తులను ప్లాంటులో ఉత్పత్తి చేస్తామన్నారు. భారత్‌తోపాటు మధ్యప్రాచ్య దేశాలకూ ఎగుమతి చేస్తామని చెప్పారు. ప్లాంటు అందుబాటులోకి వస్తే ఆదాయం రూ.200-250 కోట్లు పెరుగుతుందన్నారు. ఫీడ్ ప్లాంట్లు రూ.70 కోట్లతో.. స్నేహ చికెన్ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న స్నేహ ఫామ్స్‌కు చెందిన స్నేహ ఫుడ్ అండ్ ఫీడ్స్‌కు హైదరాబాద్, కరీంనగర్, జడ్చర్ల, విజయవాడ వద్ద కోళ్ల దాణా (ఫీడ్) తయారీ ప్లాంట్లున్నాయి. నాలుగు ప్లాంట్ల సామర్థ్యం రోజుకు 3,000 టన్నులు. మరో రెండు ప్లాంట్లను రూ.70 కోట్లతో దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏర్పాటు చేస్తోంది. గతంలో రైతులే సొంతంగా దాణా తయారు చేసుకునేవారు. ఇప్పుడు అందుబాటు ధరలో, నాణ్యమైన దాణా మార్కెట్లో లభిస్తోంది. దీంతో రెడీమేడ్ దాణాకు గిరాకీ పెరుగుతోందని కంపెనీ చెబుతోంది. కంపెనీ టర్నోవరు ప్రస్తుతం రూ.1,500 కోట్లుంది. ఎఫ్ఎంసీజీ విభాగంలోకి.. సోయా, రైస్ బ్రాన్ (తవుడు) నూనెను సఫల బ్రాండ్‌తో కంపెనీ విక్రయిస్తోంది. ఉత్పత్తుల సంఖ్య ఎక్కువగా ఉండాలన్న డీలర్ల కోరిక మేరకు సన్‌ఫ్లవర్, పల్లి నూనె కూడా సఫల బ్రాండ్ కిందకు తెచ్చినట్టు రామ్‌రెడ్డి తెలిపారు. కష్ణపట్నం వద్ద ప్యాకింగ్ యూనిట్ నెలకొల్పామన్నారు. కొద్ది రోజుల్లో గోధుమ పిండి, ఉప్పు, మినరల్ వాటర్ వంటి ఉత్పత్తులను పరిచయం చేస్తామని పేర్కొన్నారు. ఏటా రెండు కొత్త ఉత్పత్తులు తేవాలన్నది ఆలోచనగా చెప్పారు. చికెన్ ఆధారిత రెడీ టు ఈట్ ఉత్పత్తులను పెద్ద ఎత్తున మార్కెట్లోకి తెస్తామని తెలిపారు.