షుగర్ తగ్గితే గుర్తించే కుక్కలు!
మధుమేహులకు శుభవార్త. పెంపుడు కుక్కలకు కాస్తంత శిక్షణ ఇస్తే.. తమ యజమానికి రక్తంలో చక్కెర స్థాయి బాగా తగ్గినప్పుడు అవి గుర్తు పట్టగలవట! మధుమేహం బాధితులకు అది బాగా తగ్గినప్పుడు అత్యంత ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోవడం వల్ల ఉన్నట్టుండి బాగా నీరసం రావడం, కాళ్లు-చేతులు వణకడం, కళ్లు తిరిగి పడిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. సరిగ్గా ఇలాంటి సందర్భాల్లో కుక్కలు ముందుగా తమ యజమానుల పరిస్థితిని గమనించి, వాళ్లను హెచ్చరిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
అయితే ఇందుకోసం ముందుగా తాము పెంచుకుంటున్న కుక్క పిల్లలకు కొద్దిపాటి శిక్షణ ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల అవి తమ యజమానికి హైపోగ్లెసీమియా వచ్చినప్పుడు వెంటనే గమనించి వారిని తమకు చేతనైనట్లుగా హెచ్చరిస్తాయి. దీనివల్ల వాళ్లు వెంటనే తగిన నివారణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
హైపోగ్లెసీమియా అనే పరిస్థితి వచ్చినప్పుడు రక్తంలో చక్కెర స్థాయి ప్రమాదకరంగా పడిపోతుంది. కుక్కలకు వాసన పసిగట్టే లక్షణం చాలా ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. తమ యజమాని చెమట లేదా ఊపిరి తీసుకునే పద్ధతిలో ఏమాత్రం మార్పు వచ్చినా అవి వెంటనే పసిగట్టగలవు. సాధారణంగా హైపోగ్లెసీమియా వచ్చినప్పుడు ఈ రెండు లక్షణాల్లోనే తేడా కనిపిస్తుంది. చెమట ఎక్కువగా పట్టడం, ఊపిరి వేగంగా తీసుకోవడం లాంటివి మధుమేహులలో కనిపించే ప్రాథమిక లక్షణాలు. సరిగ్గా వీటినే కుక్కలు పసిగడతాయి.
ఈ విషయం గురించి యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ప్రత్యేకంగా 'గ్లైసీమియా ఎలర్ట్ కుక్కల' పేరుతో శిక్షణ ఇచ్చిన శునకాలను వారు కొందరు యజమానులకు అలవాటు చేశారు. వాళ్లకు మధుమేహం స్థాయి బాగా పెరిగినప్పుడు గానీ, తగ్గినప్పుడు గానీ అవి గుర్తించేలా చేశారు. యజమానులకు రక్తంలో మధుమేహ స్థాయి మారగానే అవి గుర్తుపట్టి వెంటనే యజమానులతో పాటు కుటుంబ సభ్యలకు కూడా తమకు అలవాటైన పద్ధతిలో చెబుతాయి.
ఇందుకోసం ఇప్పటివరకు 17 శునకాలకు శిక్షణ ఇచ్చారు. ఇవన్నీ కూడా యజమానుల ఆరోగ్యాన్ని సరిగ్గానే గుర్తించి పరీక్షలో నెగ్గాయి. త్వరలో ఇలా మరిన్ని శునకాలకు శిక్షణ ఇచ్చి, అవసరంలో ఉన్నవారికి ఉచితంగా ఇచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొందరు యజమానులైతే సొంతంగా కూడా ఇలాంటి శిక్షణ ఇచ్చుకుంటున్నారు. శిక్షణ పొందిన కుక్కలు పారామెడికల్ సిబ్బంది చెప్పినంత కచ్చితంగానే కుక్కలు కూడా మధుమేహం విషయాన్ని గుర్తించి చెబుతున్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో మధుమేహం స్థాయిని గుర్తించేందుకు గ్లూకోమీటర్లను తయారుచేసే కంపెనీలు లెక్కలేనన్ని ఉన్నాయి. కానీ, ఒక మీటర్ చూపించే రీడింగ్‌కు, మరో మీటర్ చూపించే రీడింగ్‌కు సంబంధం ఉండదు. అలాగే, గ్లూకోమీటర్‌లో చూసుకున్నప్పుడు వచ్చే ఫలితానికి, మామూలుగా రక్తపరీక్ష చేయించుకున్నప్పుడు వచ్చే ఫలితానికి కూడా చాలా తేడా కనిపిస్తుంది. అలాంటి మిషన్ల మీద ఆధారపడి అనవసరంగా పప్పులో కాలేయడం కంటే.. ఎంచక్కా మంచి కుక్కపిల్లను పెంచుకుని, దానికి తగిన శిక్షణ ఇచ్చి మధుమేహం అంచనా వేసుకోవడం ఉత్తమమని శాస్త్రవేత్తలు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు.