సిటీ వణుకు
పడిపోతున్న ఉష్ణోగ్రతలు
గజగజలాడుతున్న నగరవాసులు
ఈ ఏడాది రికార్డు చలి
13.5 డిగ్రీలు ఈ సీజన్లో ఇదే అత్యల్పం
సిటీబ్యూరో: చలి గాలులు నగరవాసులను గజగజలాడిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. చీకటి పడితే చలి తీవ్రత పెరుగుతండటంతో జనం రోడ్లపైకి రావడానికి జంకుతున్నారు. సూర్యోదయాన మంచు ప్రభావం మరింత తీవ్రంగా ఉంటోంది. నగర శివారు ప్రాంతంలో మంచుతీవ్రత ఎక్కువగా ఉంది. శుక్రవారం కనిష్టంగా 13.5 డిగ్రీలు, గరిష్టంగా 30.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ శీతాకాలంలో ఇప్పటికి ఇదే అత్యల్ప రికార్డు. రానున్న 24 గంటల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో వాహనదారులు, ప్రయాణికుల ఇబ్బందులు వర్ణనాతీతం. స్వెట్టర్, మఫ్లర్, మంకీక్యాప్, జర్కిన్, గ్లౌజులు, స్కార్ఫ్లు లేనిదే బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
ఈ సీజన్లో ఉష్ణోగ్రతలు పడిపోవడం సాధారణమే అయినా శీతలగాలులు, మంచు ప్రభావం కారణంగా ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో చలితీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గడచిన పదేళ్ల రికార్డులను పరిశీలిస్తే గ్రేటర్ పరిధిలో 2005లో కనిష్ట ఉష్ణోగ్రత 8.7 డిగ్రీలకు పడిపోవ డం ఇప్పటివరకు ఉన్న రికార్డు. చాదర్ఘాట్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో ఉన్ని, లెదర్ దుస్తులు విక్రయించే దుకాణాలు వినియోగదారులతో సందడిగా మారాయి. చర్మవ్యాధులు, అస్తమా రోగులు, చిన్నారులు, వృద్ధులు చలితీవ్రతకు పలు ఇబ్బందులు పడుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అనర్థాలు తప్పవని చర్మ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.