‘గాడ్సేలను నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు’
ఆత్మకూర్: జాతిపిత మహాత్మాగాంధీని పొట్టనబెట్టుకున్న ఆర్ఎస్ఎస్ను ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీ నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారని, ఆర్ఎస్ఎస్ను నిషేధించిన అప్పటి హొంమంత్రి పటేల్‌ను తమ వాడిగా ప్రచారం చేసుకోవడం విచారకరమని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శోభన్‌నాయక్ అన్నారు. గురువారం స్థానిక మార్కెట్‌యార్డులో ఎస్ఎఫ్ఐ ప్రతినిధుల సభ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డివి జన్ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కేంద్ర ప్రభుత్వం దేశ భక్తులుగా గుర్తిస్తున్నదని, గుజరాత్లో ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో సైతం ఆర్ఎస్ఎస్ను సంబోధిస్తూ మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నారన్నారు. కాలానికి అనుగుణంగా పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని బోధించకుండా మతోన్మాదానికి పెద్దపీట వేయడం దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమన్నారు.
ప్రధాని నరేంద్రమో డీ అణగారిన కులాల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారన్నారు. స్వచ్చభారత్ పేరుతో ప్రచారం చేసుకుంటూ ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. భారతదేశాన్ని శుభ్రంగా ఉంచే సఫాయి కార్మికుల్లో అణగారిన కులాల వారే అధికంగా ఉన్నారని గుర్తుచేశారు. 14,884 పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యావ్యవస్థను పటిష్టం చేయకపోగా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం అక్షరాస్యతలో పూర్తిగా వెనుకబడిందని, బడ్జెట్లో విద్యకోసం మొక్కుబడిగా నిధులు కేటాయించడం దారుణమన్నారు.