కేరళలో బాహుబలి హంగామా
ఈర్ష్య, ద్వేషం, అధికార దాహం... అన్నదమ్ముల మధ్య ఎలా చిచ్చు పెట్టాయి? మరో కురుక్షేత్రానికి ఎలా కారణమయ్యాయి? అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతోన్న భారీ జానపద చిత్రం ‘బాహుబలి’. మహాభారత కథను పోలి ఉండే కథాంశంతో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, రానా ప్రతినాయకునిగా నటిస్తున్నారు. అనుష్కది ఇందులో కథకు కేంద్ర బిందువులాంటి పాత్ర. అందుకే అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన రెండవ మేకింగ్ వీడియోని నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘భారతీయ సినీ చరిత్రలో చెప్పుకోదగ్గ భారీ చిత్రాల్లో ‘బాహుబలి’ ఒకటిగా నిలుస్తుందని నమ్మకంగా చెప్పగలం.
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ‘బాహుబలి మేకింగ్ వీడియో’కి అద్భుతమైన స్పందన వచ్చింది. గురువారం అనుష్క పుట్టిన రోజును పురస్కరించుకొని ‘బిహైండ్ ది సీన్స్’ వీడియోను విడుదల చేశాం. అనుష్క గెటప్, ఆమెకు మేకప్ చేస్తున్న దృశ్యాలు, అనుష్క కాస్ట్యూమ్స్ కోసం డిజైనర్లు వేసిన డ్రాయింగ్స్ ఈ వీడియోలో పొందుపరిచాం. ఈ వీడియోకు నేపథ్య సంగీతం అద్భుతంగా కుదిరింది. ఆర్ఎఫ్సీలో నిర్మించిన అయిదు భారీ సెట్స్‌లో ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేశాం. మూడు వారాల పాటు కేరళలో మరో షెడ్యూల్ చేయబోతున్నాం. చరిత్రలో నిలిచిపోయే సినిమా ‘బాహుబలి’ అవుతుంది’’ అని తెలిపారు.
అనుష్క మాట్లాడుతూ- ‘‘రాజమౌళితో రెండోసారి పనిచేయడం ఆనందంగా ఉంది. సన్నివేశాలు అనుకున్నట్లు రావడానికి ఎంతైనా శ్రమిస్తారాయన. ఈ సినిమా కోసం 60 రోజులు షూటింగ్ చేశామంటే నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ఈ సినిమాకు పనిచేస్తుంటే టైమ్ తెలియడం లేదు’’ అన్నారు. ఈ చిత్రానికి కథ: వి.విజయేంద్రప్రసాద్, మాటలు: అజయ్, విజయ్, కెమెరా: కె.కె.సెంథిల్‌కుమార్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, పోరాటాలు: పీటర్ హేయిన్స్, స్టైలింగ్: రమా రాజమౌళి,ప్రశాంతి తిపిర్నేని, సమర్పణ: కె.రాఘవేంద్రరావు, నిర్మాణం: ఆర్కా మీడియా వర్క్స్.