హెచ్‌సీయూ ప్రొఫెసర్లపై సస్పెన్షన్ వేటు..?
సాక్షి, సిటీబ్యూరో: హెచ్‌సీయూ ఘటనలో అరెస్టై చర్లపల్లి జైలులో ఉన్న ఇద్దరు ప్రొఫెసర్లపై సస్పెన్షన్ వేటు వేయనున్నారా..అంటే అవుననే అంటున్నాయి అధికారిక వర్గాలు. యూనివర్సిటీ సర్వీసు రూల్స్ ప్రకారం ఏదైనా ఒక నేరారోపణపై అరెస్టై 48 గంటల పాటు జైల్లో గడిపితే వారిని సస్పెండ్ చేసే అధికారం ఆ యూనివర్సిటీకి ఉంది. ఒక వేళ యూనివర్సిటీ వీరిని సస్పెండ్ చేస్తే నెలసరి వేతనం సహా ఇతర అలవెన్సులు, సీనియార్టీ, పదోన్నతులన్నీ నిలిచిపోతాయి.
అయితే సస్పెన్షన్‌కు ముందు వారికి షోకాజు నోటీసులు జారీ చేస్తారు. కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ కేసు కొనసాగుతూనే ఉంటుంది. హియరింగ్‌కు వచ్చిన తర్వాత వాదనలు విన్పించే అవకాశం కల్పిస్తుంది. ముద్దాయి నేరం చేసినట్లు రుజువైతే వారు తమ ఉద్యోగాన్ని కోల్పొయే ప్రమాదం ఉంటుంది. ఒక వేళ నేరం రుజువు కాకపోతే సస్పెన్షన్ కాలంలో నిలిపివేసిన వేతనం సహా ఇతర అలవెన్సులు, సర్వీసు, పదోన్నతి వంటి సదుపాయాలన్నీ తిరిగి పొందుతారు.