అధికారంలోకి వస్తే ఈసీకి జైలు శిక్ష
సాక్షి, ముంబై: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల సంఘంపై చర్యలు తీసుకుంటామని భరిప బహుజన్ మహాసంఘ్(బీబీఎమ్) చైర్మన్, బీఆర్ అంబేద్కర్ మనువడు ప్రకాశ్ అంబేద్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర యవత్మాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, పుల్వామా దాడి గురించి మాట్లాడకుండా ఆంక్షలు విధించడం దారుణమని విమర్శించారు. ‘రాజ్యాంగ పరిధిలో అంశమే అయినప్పటికీ పుల్వామా దాడి గురించి ప్రస్తావించకూడదని ఎన్నికల సంఘం ఎందుకు అడ్డుకుంటుందో అర్థం కావడం లేదు. మన ప్రభుత్వం వచ్చాక ఎలక్షన్ కమిషన్‌పై చర్యలు తీసుకుంటుంది. రెండు రోజులు ఎన్నికల సిబ్బందిని జైల్లో పెడుతుంది. తటస్థంగా ఉండాల్సిన ఈసీ బీజేపీ తొత్తుగా వ్యవహరిస్తుంది’ అని అన్నారు.
ప్రకాశ్ అంబేద్కర్ సోలాపూర్, అకోలా లోక్‌సభ నియోజకవర్గాల నుంచి వంచిత్ బహుజన్ అగాదీ (వీబీఏ) అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలో బరిప్ బహుజన్ మహాసంఘ్, ఏఐఎమ్ఐఎమ్, జనతా దళ్(ఎస్) లు కలిసి వీబీఏ కూటమి గా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కూటమి ఏ పార్టీ ఓట్లు చీల్చుతుందోనని అధికార బీజేపీ, విపక్షాల్లో కలవరం మొదలైంది. కాగా సోలాపూర్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్న ప్రకాశ్ అంబేద్కర్‌కు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ(ఎం) ప్రకటించింది.