నా విజయం మావుళ్లమ్మ మహిమే : సినీ నటుడు సునిల్
సినీనటుడు సునిల్
ఉత్సవాల్లో ఘన సన్మానం
భీమవరం అర్బన్ : మావుళ్లమ్మ వారి మహిమ వల్లే తాను ఇంతటివాడినయ్యానని సినీ నటుడు సునిల్ అన్నారు. మావుళ్లమ్మ ఆలయ 51వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా ఆది వారం సునిల్‌ను ఉత్సవ కమిటీ, నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అనంతరం సువర్ణ హస్తా కంకణం, జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా సునిల్ మాట్లాడుతూ మావుళ్లమ్మ వారిని ఎప్పుడూ పూజించేవాడినని, పరీక్షలకు వెళ్లే ప్పుడు అమ్మవారి వద్ద పెన్ను పెట్టేవాడినని గుర్తు చేసుకున్నారు.
కార్యక్రమంలో నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, మునిసిపల్ మాజీ చైర్మన్ గ్రంధి వెంకటేశ్వరరావు, వేగేశ్న కనకరాజు సూరి, ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షుడు అడ్డాల రంగారావు, అధ్యక్షుడు మానే పేరయ్య, నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం గౌరవాధ్యక్షుడు కాగిత వీరమహంకాళి రావు, అధ్యక్షుడు రామాయణం గోవిందరావు, కొప్పుల సత్తిబాబు, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కామెడీ విలన్ పాత్ర వేయాలని ఉంది
దేవత సినిమాలో మోహన్‌బాబు చేసిన కామెడీ విలన్ లాంటి పాత్ర వేయాలని ఉందని సినీ నటుడు సునిల్ తన మనసులో మాట చెప్పారు. ఆదివారం భీమవరం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకు అనేక పాత్రలు చేసినా కామెడీ విలన్ పాత్ర వేయలేదని, ఏ దర్శకుడైనా అవకాశమిస్తే వెంటనే అంగీకరిస్తానన్నారు. ఇప్పటి వరకు 158 సినిమాల్లో నటించానని చెప్పారు. ప్రస్తుతం దిల్‌రాజ్ బ్యానర్‌పై వాసువర్మ దర్శకత్వంలో, అనిల్ సుంకర బ్యానర్‌పై గోపి మోహన్ దర్శకత్వంలో మూడు చిత్రాల్లో నటిస్తున్నానని తెలిపారు.
ఈ నెలలో దిల్‌రాజు బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. ప్రేక్షకులు సునిల్ నుంచి ఎటువంటి హాస్యాన్ని కోరుకుంటారో అదే ఈ చిత్రాల్లో కనిపిస్తుందన్నారు. కుటుంబ సమేతంగా వచ్చి ఆనందంగా చూసే విధంగా తన చిత్రాలు ఉంటాయన్నారు. మన్మధుడు చిత్రంలో బంకు సీను పాత్ర, మర్యాద రామన్నలో హీరో పాత్ర తనకు ఎంతగానో నచ్చాయని వివరించారు. అందరు దర్శకుల సినిమాల్లోను నటించాన్నదే తన కోరిక అని వివరించారు.
మావుళ్లమ్మ ఉత్సవాల్లో నేడు
సాయంత్రం 5 గంటలకు భీమవరానికి చెందిన కె.లలితకుమారి భాగవతారిణి హరికథ
సాయంత్రం 6 గంటలకు భీమవరానికి చెందిన మధు ఆర్కెస్ట్రా సినీ సంగీత విభావరి
రాతి 9 గంటలకు రాజమండ్రికి చెందిన ఉమా శ్రీ వాణి కళానికేతన్తో ‘పంచరత్నములు’ నాటకం