బంధం నిలవాలంటే నమ్మకాన్ని నిలుపుకోవాలి
ప్రాణస్నేహితురాలు బిందు సడెన్ గా తనతో మాట్లాడటం మానేసింది. ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని పెట్టేస్తోంది. మళ్లీ చేస్తానంటుంది కానీ చేయదు. చాలా ముభావంగా ఉంటోంది బిందు. దాంతో తీవ్రంగా హర్ట్ అయ్యింది సౌమ్య. ఎందుకలా చేస్తున్నావని ఎంత అడిగినా చెప్పకపోవడం బాధపెట్టిందామెని. అప్పట్నుంచీ దాని గురించే ఆలోచిస్తోంది.
విషయం ఏమిటంటే ఆమెని నమ్మి బిందు ఒక విషయం చెప్పింది. అది సౌమ్య మరొక స్నేహితురాలైన లక్ష్మితో షేర్ చేసుకుంది. లక్ష్మి బిందుని దాని గురించి అడగడంతో ఆమె హర్టయ్యింది. అయితే ఇది సౌమ్య కావాలని చేయలేదు. ఏదో మాటల్లో బయటపెట్టేసింది. అది బిందు వరకూ వెళ్తుందని, ఆమె బాధపడి, తనకు దూరమవుతుందని ఊహించలేకపోయింది.
మనలను నమ్మి ఎవరో ఏదో చెబుతారు. అది మన విషయం కాదు కాబట్టి లైట్ తీసుకుని, దాన్ని మనం మరొకరికి చెప్పేస్తాం. అవతలివాళ్లకు అది చాలా విలువైన విషయం కావచ్చు. మీరు తన జీవితంలో విలువైన వ్యక్తి కాబట్టి మీతో చెప్పుకుని ఉండొచ్చు. అది గుర్తు పెట్టుకోకపోతే వారు మీకిచ్చిన విలువ, మీ మీద పెట్టుకున్న విశ్వాసం మాయమైపోవడానికి క్షణం పట్టదు.
ఎన్నోయేళ్లు అప్యాయతానురాగాలతో పెనవేసుకున్న బంధాన్ని క్షణాల్లో తుంచేసుకోవడం మంచిదేనా? తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, స్నేహితులు, కొలీగ్స్... ఎవరైనా కానీ, మనల్ని నమ్మితేనే రహస్యాలు చెబుతారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నప్పుడే వారితో మన బంధం కూడా నిలబడుతుంది. ఏ బంధమైనా శాశ్వతంగా నిలబడేది విశ్వాసం మీదనే అని, దాన్ని కాపాడుకోవాలని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే బంధాలు పటిష్టంగా నిలిచి ఉంటాయి.