నేనుమార్లిన్ మన్రో!
‘‘ఈ హాలీవుడ్ చిత్రమైంది. ఇక్కడ మీ ఆత్మను పరిస్తే దక్కేది యాభై చిల్లర పెంకులు; అదే ఒక్క ముద్దుకు వేయి డాలర్లు ముడతాయి.’’
నాకు ఇప్పుడే తెలిసింది. ‘ఫాక్స్’ వాళ్లు నన్ను ‘సమ్‌థింగ్ ఈజ్ గాట్ టు గివ్’ నుంచి తొలగించారట. డెరైక్టర్ జార్జ్ కుకర్ నాతో పనిచేయలేనని చెప్పాడట. నేను ఆలస్యంగా షూటింగులకు వెళ్తున్నానట. నిలకడగా ఉండనట. మరి ఎవరిని పెట్టి పూర్తిచేస్తారు? మరో మార్లిన్ మన్రో దొరుకుతుందా వీళ్లకు?
‘సమయానికి’ రెడీ అవడం నాకెందుకు చేతకాదు! అందమైన స్త్రీకి, అద్దం ముందు కూర్చుంటే ఎందుకు తనివి తీరదో ఎవరూ కనిపెట్టినట్టులేదు. ఇంటిని అటుండనీ, ఒంటిని దిద్దుకోవడంలోనే నాకు తెల్లారిపోతుంది. ఇక నాకు మేకప్ ఎందుకు? ఎటని వెళ్లను! రాత్రి మస్కారా కూడా అలాగేవుంది. షాంపేన్ ఎక్కడుంది? నేను ఎలా నడిచినా ఆకర్షణీయంగానే ఉన్నప్పుడు, ఊగుతూ తూగుతుంటే మాత్రం బాగుండనా! మార్లిన్, నువ్వు ఫ్యాషన్ ఇండస్ట్రీని పదేళ్ల ముందుకు జరపగలవు! అలాంటిదాన్ని, ఫ్రాంక్ (సినట్రా) ఏమన్నాడు? కొంపదీసి, ఇక్కడే (కాల్ నేవా క్యాసినో) చచ్చిపోదుగా, అన్నాడా! నన్ను తోసేయమని చెప్పినట్టేగా! తను నామీద ఆశపడ్డవాడేగా! ఇప్పుడేం చేస్తావో చెయ్యి. ఇంకో పెగ్గు వంపుకుంటున్నా!
ఈ ఇల్లు నాది. త్రీ బెడ్రూమ్. మెక్సికన్ స్టైల్లో కట్టించాను. నా ఫైర్‌ప్లేస్ ఎలా ఉంటుంది? డ్రెస్సర్, టిన్ కేండిల్బ్రా, ఫోల్డింగ్ స్టూల్స్... ఎక్కడ కొన్నానో అందరికీ కావాలి! అందరికీ ఎందుకు తెలియడం? పడుకున్నప్పుడు మీరు పైజామా ధరిస్తారా? గౌనా? ఇంకేమైనా? సినిమా తార అయితే ఏదైనా అడిగేయొచ్చా? మీకు వారానికి ఎంతమంది బాయ్ఫ్రెండ్సు? గాసిప్ కాలమ్స్ ఎక్కువ చదువుతారనుకుంటాను. ఏడీ నా మగస్నేహితుడు? హల్లో... నేను ల్లో అని ఒత్తి పలకడం ముచ్చటగా ఉంటుందట. పలకరించడానికి ఎవరూ లేరే!
నా తండ్రి అని చెప్పిన వ్యక్తిని నేను తండ్రిగా భావించలేదు. మా అమ్మ ఫొటోలో చూపించినాయన బాగున్నాడు. సన్నమీసం, క్లార్క్ గేబుల్లా. ఆయన నాన్నయితే ఎంత బాగుండు! అమ్మకు మానసిక స్థిమితం లేదు; ఆర్థిక స్థిమితం అసలు లేదు. అందుకే నేను దేశపు బిడ్డను. నేను అనాథగా పెరగాలా! అమ్మ స్నేహితురాలు గ్రేస్ మెకీ నా బాధ్యత తీసుకుంది. జీన్ హార్లో అంటే పడిచచ్చేది. ఆమెలాగా నాకు మేకప్ చేసేది. నువ్వు కూడా సినిమా స్టార్‌వి కావాలనేది. పదకొండేళ్లకొచ్చాను కదా! సినిమా గొప్పతనం అర్థమవుతోంది. కానీ గ్రేస్ భర్త ప్రవర్తన అర్థంకాలేదు.
అప్పుడు జేమ్స్ (డఫెర్టీ) పరిచయమయ్యాడు. పరిచయం ఏంటి? మా పక్కిల్లేగా! జిమ్మీ అనేదాన్ని. పోలీసు కావాలని అతడి కోరిక. జిమ్మీని చేసుకుంటే ఆసరా దొరుకుతుంది. పదహారేళ్ల అమ్మాయి, ఇరవయ్యేళ్ల అబ్బాయి! నేను ప్రేమించానా అతణ్ని? నేను హుషారుగా పాడతాను, ఆనందంతో నృత్యం చేస్తాను. అది జిమ్మీకి అర్థమయ్యేది కాదు. దాంతో మాకు మాటలు లేకుండా పోయాయి.
నేను ఆర్మీ ఫ్యాక్టరీలో పని చేస్తున్నప్పుడొక అద్భుతం జరిగింది. మమ్మల్ని ఫొటోలు తీయడానికి డేవిడ్ కనోవర్ వచ్చాడు. యువతులు కూడా యుద్ధంకోసం కష్టపడుతున్నారని చెప్పాలిగదా! అతడే నన్ను మోడలింగ్ ఏజెన్సీకి అప్లై చేసుకొమ్మన్నాడు. నా పాతజీవితం నాకు నచ్చలేదు. నా కలలకు అందులో చోటులేదు. ఇంకేం, జీన్ హార్లో మళ్లీ వచ్చిందన్నారు. ‘నయాగరా’లోని నా నడకను యువతులు అనుకరిస్తున్నారట! ‘జెంటిల్మెన్ ప్రిఫర్ బ్లాండెస్’... ‘హౌ టు మ్యారీ ఎ మిలియనీర్’... ‘రివర్ ఆఫ్ నో రిటర్న్’... బంగారుజుట్టు, అమాయకపు చూపులు... మార్లీన్, యు ఆర్ సో స్వీట్!
‘ద సెవెన్ ఇయర్ ఇచ్’ అప్పుడు నా లోపలి గోడల్ని ప్రేమ గోకుతోంది. జిమ్మీతో విడాకులయింతర్వాత జో(డిమాగియో) దగ్గరయ్యాడు. బేస్‌బాల్ ఆటగాడు. 56 గేమ్స్‌తో హిట్టింగ్ స్ట్రీక్ వరల్డ్ రికార్డ్ ఉంది. పిల్లాడి తండ్రి! ఇదీ నిలబడలేదు. కారణం: గాలికి పైకిలేచే స్కర్టు సీన్. నా సిగ్నేచర్ ఫొటో! కానీ జో నొచ్చుకున్నాడు. అరుచుకున్నాం. లిజ్ రినే, క్లియో మూర్, రీటా గామ్... ఎంతమందితో అతడికి సంబంధముందని వార్తలొచ్చాయి. పబ్లిగ్గా ఒప్పుకున్నాడా? జోసెఫ్‌ను నా పిల్లాడిలా చూసుకుందామనుకున్నానే! జో ఒకప్పుడు గొప్పగా ఆడివుండొచ్చు. ఇప్పుడు నా అంత ఇమేజ్ ఏడిచిందా? మాది 274 రోజుల పెళ్లి అని లెక్కలేస్తున్నారట. అదేమైనా థియేటర్లో ఆడుతున్న సినిమానా?
డిమాగియో బాధ కూడా నిజమేనేమో! ఇంతా చేస్తే నేను సెక్స్ సింబల్నా? 37-23.5-37.5 కొలతల శరీరాన్నా? నేను యంత్రాన్ని కాదు. ‘బస్‌స్టాప్’లో నా నటనను విమర్శకులు మెచ్చుకుంటున్నారట! ఇన్నిరోజులూ నా నడుము దగ్గరే ఆగిపోయాయా వాళ్ల చూపులు? ఈ మాత్రం పరిణతి చూపకపోతే ఆర్థర్ మిల్లర్ నన్ను ఎలా భార్యగా అంగీకరిస్తాడు!
ఆర్థర్ నాకోసమే మిస్ఫిట్స్ రాస్తున్నాడు. కానీ మాకు మేము మిస్ఫిట్స్గానే ఉండిపోతున్నామా! ఆర్థర్‌తో నాకు ఏం సమస్య ఉంది? ప్రేమ లేకపోతే నేనెందుకు కోర్టులో అతడికోసం నిలబడ్డాను! నిర్మాతలందరూ నా కెరీర్‌ను రిస్క్ చేస్తున్నావన్నారు. కమ్యూనిస్టులతో నీకెందుకు అన్నారు. సినిమావాళ్లు, కార్మికులు, నల్లవాళ్లు, అరబ్బులు, యూదులు అందరూ సోదరుల్లా మెలగాలని కోరుకున్నానే! దానివల్ల ఎఫ్బిఐ నా మీద కూడా నిఘా పెట్టిందే!
టోనీ కర్టిస్! ఓ లవ్లీ మేన్! నేను చంచలను. పురుషుడి ఆకర్షణకు లొంగిపోకుండా ఉండే మనోబలం నాకెందుకు లేదు!
హ్యాపీ బర్త్‌డే మిస్టర్ ప్రెసిడెంట్! నాలాంటి అతిలోక సుందరికి జాన్ (ఎఫ్ కెన్నెడీ) లాంటివాడే సరైన జోడి. నా సాన్నిహిత్యం ఆయన పదవికి అలంకారమా? ఆటంకమా? నన్నే తిరస్కరిస్తాడా ఎంత అధ్యక్షుడైతే మాత్రం! నేను లేకపోతే ఏమిటో చూపించాలి. నేను ఎక్కడ పుట్టాను? ఎలా పెరిగాను? ఎవర్ని ఆదరించాను? దేహం మీద మమకారం కొద్దీ ఆత్మను నిర్లక్ష్యం చేశానా? ఆత్మను శుభ్రం చేసుకోవడం సాధ్యమేనా? ఇంకా ఈ దేహపు వస్త్రాలు నాకెందుకు? బార్బిట్యురేట్స్... ఎన్ని మాత్రలు వేసుకుంటే కళ్లు మళ్లీ తెరవకుండా నిద్రపోతాం? అయినా నేనెందుకు చావాలి? హాయిగా పిల్లల్ని కంటాను, పెద్దచేస్తాను, అమ్మమ్మనైపోతాను. ఏం బాగుండదా? మార్లిన్ మన్రో నానమ్మా! నేను నక్షత్రం లాంటిదాన్ని. కానీ నక్షత్రాల వయసు తెలుసా? నేను గృహిణిగా బతకలేదు. ప్రయత్నమైతే చేశాను. తల్లిని కావాలని ఎంతగా ఆశపడ్డాను! మూడుసార్లు గర్భస్రావం అయిపోయిందే! నేను స్త్రీగా విఫలమయ్యాను. నానుంచి ఎవరైనా ఏం ఆశించారు? నేనేం ఇవ్వలేకపోయాను? నేను ప్రేమించిన మనిషిగా వాళ్లను ప్రేమించానా? వాళ్లను వాళ్లుగా ప్రేమించానా?
ఒక్క నిమిషం. ఫాక్స్ వాళ్ల నుంచి సందేశం. నాకోసం డెరైక్టర్నే మార్చేస్తామంటున్నారు. ఎందుకు మార్చరు! కానీ చప్పగా ఉంది. నేను ఉత్సాహంగా కనబడ్డానేమోగానీ ఏనాడూ ఆనందంగా లేను. ఎవరి నొప్పిని వారే అనుభవించాలి. జీవితం పట్ల కఠినంగా ఉండాలంటారు. కోమలమైన స్త్రీ అలా ఎలా ఉండగలదు? కఠినత్వంలో ఏ స్త్రీత్వమూ లేదే!
నేను 1926లో పుట్టాను. ఇది 1962. 26-62. ఇదేదో చిత్రంగా ఉంది. జీన్ హార్లో కూడా ఎక్కువ కాలం బతకలేదు. 26 ఏళ్లకే పోయింది. చివరికి నా దేహం కూడా నశిస్తుందా? మనిషికి అర్థవంతమైన ముగింపు ఏదవుతుంది? నాకు ఏస్పర్జర్ సిండ్రోమ్ ఉందంటారేమో! నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారేమో! నేనేమిటో అర్థంకాక తలలు బద్దలు గొట్టుకోవాలి. మార్లిన్ మన్రో అనే రాకుమారి గురించి జానపద కథలా లోకం చెప్పుకుంటూనే ఉండాలి.
నా మొదటి భర్త జేమ్స్ నేను చనిపోయానని తెలిస్తే ఏమంటాడు? తన పోలీసు డ్యూటీలో పాట్రోల్కు వెళ్తూ ‘ఐ యామ్ సారీ’ అనేస్తాడంతే! ఆర్థర్... రచయిత కదా! నాలాంటి జీవితాలకు శుభం కార్డు పడదని ఆయనకు తెలిసేవుంటుంది! జో మాత్రం మళ్లీ చేరువయ్యాడు. సినిమావాళ్లకూ క్రీడాకారులకూ మధ్య ఏదో తెలియని సంబంధం. వాస్తవం కన్నా కల్పనలోనే ఎక్కువగా బతుకుతాం కాబోలు. అయినా, ‘జస్ట్ ఫ్రెండ్స్’గా మాత్రమే ఉండదలిచాను. నువ్వు ఏమైనా చేయగలిగితే నా శరీరానికి అంతిమసంస్కారాలు నిర్వహించు. నీ చేతులకు తోచినప్పుడు నా సమాధి ముందు కొన్ని ఎర్రగులాబీ పూలనుంచు!
కథనం: ఆర్. ఆర్.