బరువులెత్తే వ్యాయామాలు అమ్మాయిలకు అవసరం...
సిక్స్‌ప్యాక్ క్వీన్ సోనాలి స్వామి
జిమ్‌దగీ
‘‘వయసుతో సంబంధం లేకుండా మహిళలు వర్కవుట్స్ చేసి, ఫిట్‌గా మారవచ్చు. బరువులు మోస్తే మగవాళ్లలా కండలు వస్తాయనేది అపోహ మాత్రమే’’ అంటున్నారు బెంగుళూర్‌కు చెందిన ఫిట్నెస్ మోడల్ సోనాలి స్వామి. పెళ్లయి, పిల్లలు పెద్దయ్యాక 38 ఏళ్ల వయసులో బాడీబిల్డింగ్‌లోకి ప్రవేశించిన సోనాలి... మూడేళ్ల క్రితం బాడీ పవర్ ఇండియా 2014’లో ఫిట్నెస్ మోడల్ టైటిల్ విజేతగా నిలిచారు. బెంగుళూర్ నుంచి ఏకైక మహిళా బాడీబిల్డర్, సిక్స్‌ప్యాక్ క్వీన్‌గా కూడా పాప్యులరైన సోనాలి...ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ముచ్చటించారారు.
వెయిట్ అండ్ షీ!
ఎరోబిక్స్, డ్యాన్సింగ్, కార్డియో ఎంతైనా చేస్తారు కాని పురుషుల్లా కనపడతామేమో అని బరువులు ఎత్తే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాలకు అమ్మాయిలు దూరంగా ఉంటారు. నేను 40కిలోల బరువు ఎత్తగలను. నేనేమీ మగవాడిలా కనపడడం లేదు కదా. వయసు పెరుగుతున్న కొద్దీ మహిళలు మజిల్ కోల్పోతుంటారు. అలా కోల్పోవడాన్ని వీలైనంత ఆలస్యం చేయడానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తప్పనిసరి. అలాగే శరీరంలో ప్రతి అవయవానికీ, ప్రతి మజిల్కీ వ్యాయామం ఇవ్వాలి. దీనికి బరువులు ఎత్తడమే మార్గం.
బాడీబిల్డింగ్ అంటే... కండలు పెంచడం కాదు
బాడీ బిల్డింగ్ పట్ల మహిళలు విముఖత చూపనక్కర్లేదు. ఎందుకంటే... దీనిలో విభిన్న రకాల కేటగిరీలు ఉంటాయి. నేను ఫిట్నెస్ మోడల్ కేటగిరీలో చేశాను. బాడీబిల్డింగ్ అంటే ఫిట్, టోన్డ్ లుక్ కూడా. మనం తీసుకుంటున్న శిక్షణ, డైట్, వీటన్నింటినీ బట్టి మార్పు చేర్పులుంటాయి. అలాగే ఫిట్‌నెస్‌కు సంబంధించి షార్ట్‌టైమ్ టార్గెట్స్ వద్దు. పెళ్లి కుదరింది కాబట్టి బరువు తగ్గాలి. లేదా డాక్టర్ చెప్పాడు కాబట్టి తగ్గాలి అనుకోకూడదు. వ్యాయామం అనేది జీవిత కాలం కొనసాగించే అలవాటుగా భావించాలి. కొత్తవాళ్లయితే ప్రారంభంలో కనీసం 30 నిమిషాల వ్యాయామం సరిపోతుంది. అయితే కాస్త అనుభవం వచ్చాక రోజుకు 1గంట వరకూ చేయాలి. ఈ గంటలోనే కార్డియో, వెయిట్ ట్రైనింగ్... అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓపిక పట్టాలి. ఇన్స్టాంట్ రిజల్ట్స్ కోసం చూడొద్దు.
కుటుంబమే బలం
ఉదయం 5గంటలకు నా దినచర్య ప్రారంభం అవుతుంది. పిల్లల్ని స్కూల్‌కి పంపేశాక, నా ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ చేస్తాను. పిల్లలు తిరిగి ఇంటికి వచ్చేలోపు నా పర్సనల్ ట్రైనింగ్ వగైరాలన్నీ పూర్తవుతాయి. ఇక సాయంత్రం నుంచి నా టైమ్ అంతా వారికే కేటాయిస్తాను. అలా ఇంటినీ, నా పేషన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం అలవాటైంది. నా భర్త సంజయ్ ప్రోత్సాహం బాగా లభిస్తోంది. నేను ట్రైనింగ్ సెషన్స్ మిస్సవ్వకుండా, సరైన ఆహారం తీసుకునేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటారు. నా ఆహారంలో వెజిటబుల్స్ అత్యధికంగా ఉంటాయి. రెడ్ మీట్ ఉండదు. అయితే ప్రొటీన్స్ కోసం చికెన్‌ను తరచు తీసుకుంటాను. ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. దీనిని గుర్తించి ఆమె ఫిట్నెస్ విషయంలో కుటుంబం అంతా శ్రద్ధ చూపించాలి.
సమన్వయం ఎస్. సత్యబాబు
సాక్షి ప్రతినిధి