ప్రతి పంచాయతీలో మొక్కలు నాటుతాం
జిన్నారం : జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో 33వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని డీఎఫ్ఓ సోనిబాలాదేవీ పేర్కొన్నారు. ఆదివారం జిన్నారం మండలం బొంతపల్లి గ్రామ పంచాయలీ కార్యాలయంలో రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎన్ని వేల మొక్కలు నాటాలి, ఎలాంటి మొక్కలు కావాలనే విషయాన్ని సోనిబాలాదేవీ స్వయంగా రైతులు, ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.
గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో నర్సరీ ఏర్పాటు చేసేందుకు స్థల పరీశీలన చేశారు. ఈ సందర్భంగా సోనిబాలాదేవీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో 33వేల మొక్కలను నాటడమే ల క్ష్యం ముందుకెళ్తున్నామన్నారు. ఇందుకోసం గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, మొక్కలకు సంబంధించిన వివరాలను సేకరించే కార్యక్రమాన్ని వేగంగా చేపడుతున్నామన్నారు.
మూడు, నాలుగు గ్రామాలకు కలిపి నర్సరీని ఏర్పాటు చేసి, మొక్కలను గ్రామాలకు సరఫరా చేసే ప్రక్రియను చేపట్టనున్నామన్నారు. గ్రామంలోని నాయకులు, ప్రజలు, అధికారుల సహకారంతో మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. మొక్కలను నాటే కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. నర్సరీలను ఏర్పాటు చేసే విషయలో ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. రైతులు సైతం భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తే వారికి మొదటిప్రాధాన్యత ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గౌరీశంకర్గౌడ్, నాయకులు వేణు, మల్లేశ్, వినోద్, గోపాల్, శంకర్, పలువురు రైతులు పాల్గొన్నారు.