పేదింటి పెరటి కాయ .. సొరకాయ...
తిండి గోల
సొరకూయతో పులుసు పెడితే ఒక రుచి, సాంబారులో వేస్తే మరో రుచి, టొమాటో వేసి కూర వండితే ఆహా రుచి, వడియాలు పెడితే కరకరలాడుతూ అన్నంలోకి నంజుకుంటే అదో రుచి, స్వీట్లు చేస్తే మహా రుచి... తెలంగాణ రాష్ట్రంలో అనపకాయగా పేరున్న సొరకాయ మన దేశంలో వేదకాలం నుండి సాగుచేస్తున్న జాతి కూరగాయ. ఇంటి పెరట్లో పెట్టి వదిలేసినా, ఏ మాత్రం పోషణలేకపోయినా విరగగాస్తుంది. అన్ని నేలల్లోనూ ఏపుగా పెరిగే గుణం సొరకు ఉంది.
దీని మూలాలు ఆఫ్రికాలో అని చెప్పినప్పటికీ క్రీ.పూ 11 వేల సంవత్సరాంతంలో మన దగ్గర సొరకాయ సాగు జరిగిందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రొటీన్లు, పిండిపదార్థాలు, ఎ-సి విటమిన్లు, ఖనిజలవణాలు పుష్కలంగా ఉన్న సొరకాయ శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది. ఎండిన సొరకాయ బుర్రలో నీళ్లు పోసి, ఉంచితే కాసేపటికే చల్లగా అవుతాయి. అందుకే పూర్వం రోజుల్లో పొలాలకు వెళ్లేవారు తాగడానికి నీళ్లు తీసుకెళ్లాలంటే వీటినే వాడేవారు. ఇక గుండ్రని సొరబుర్రలనైతే వీణలుగా కూడా ఉపయోగిస్తారు.