మురికివాడలకు మోక్షం
సాక్షి, ముంబై: ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 2000 సంవత్సరం వరకు మురికివాడలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికలు సమీపించడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా, మురికివాడ వాసులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. లబ్ది పొందేవారిలో అనేక మంది తెలుగు ప్రజలు కూడా ఉన్నారు. మురికివాడ ఇళ్లను క్రమబద్ధీకరించాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉన్నా బుధవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఆమోదం లభించింది.
అయితే అ నిర్ణయాన్ని ఎలా అమలుచేయనున్నారనేది మాత్రం ప్రభుత్వం స్పష్టం చేయలేదు. దీంతో ప్రజల్లో కొంత ఆయోమయం నెలకొంది. ఇప్పటివరకు 1995 సంవత్సరం వరకు మురికివాడలను క్రమబద్ధీకరించారు. 1995 తర్వాత వెలసిన మురికివాడలను క్రమబద్ధీకరించేందుకు నిరాకరించారు. దీంతో అనేకమంది రోడ్లెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. దీంతో 2000 సంవత్సరం వరకు వెలిసిన మురికివాడలను కూడా క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం 1995 వరకు పది లక్షలు ఉన్న మురికివాడలు 2011 వరకు 27 లక్షలకు చేరుకుంది. రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయంతో 2000 సంవత్సరం వరకు వెలిసిన మురికివాడల్లో నివసించే లక్షలాది మందికి లాభం చేకూరనుంది. అయితే 1995 జనవరి ఒకటి తర్వాత వెలిసిన మురికివాడలను క్రమబద్ధీకరించలేమని గతంలో సుప్రీంకోర్టుకు అందించిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కోంది. దీంతో రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలుచేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి తీసుకోవల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.