ఎగరనీ... సీతాకోకచిలుకనీ!
ఆత్మబంధువు
‘‘మమ్మీ... మమ్మీ... నా డ్రెస్ ఎక్కడ?’’ అరిచింది రిషిత. ‘‘నీ కప్‌బోర్డ్‌లోనే ఉంది. వెతికితే కనిపిస్తుంది’’ వంటింట్లోంచి రేఖ.
‘‘పాప కనిపించడంలేదంటోంది కదోయ్. కొంచెం వెతికివ్వొచ్చుగా’’ పేపర్ చదువుతూ తాపీగా చెప్పాడు ఆనంద్.
‘‘దాన్నే వెతుక్కోనివ్వండి’’ అంది.
‘‘తను చిన్నపిల్లోయ్...’’ అని ‘‘రా తల్లీ నేను వెతికిస్తా’’ అంటూ కప్‌బోర్డ్‌లో స్కూల్‌డ్రెస్ వెతికిచ్చాడు ఆనంద్.
ఇంతలో రేఖ బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌బాక్స్ రెడీ చేసింది. రిషితకు బ్రేక్‌ఫాస్ట్ తినిపించి, షూస్ వేసి, వాటర్బాటిల్లో నీళ్లుపట్టిచ్చాడు ఆనంద్.
‘‘మీరెందుకు తినిపిస్తున్నారు? షూస్ మీరు వెయ్యడమేంటీ?’’ అడిగింది రేఖ.
‘‘తను చిన్నపిల్లోయ్..’’
‘‘పన్నెండేళ్లొచ్చినా చిన్నపిల్లేనా!’’
‘‘పన్నెండేళ్లే కదోయ్’’ అంటూ రిషితను బస్సెక్కించి వచ్చాడు.
‘‘డాడీ.. డాడీ’’ పిలిచింది రిషిత.
‘‘ఏంటి తల్లీ?’’
‘‘నాకూ స్కూల్లో ప్రాజెక్టు వర్క్ ఇచ్చారు. కానీ నేనేమో చదువుకోవాలి’’
‘‘నేను చేసిస్తాలేరా. నువ్వెళ్లి చదువుకో.’’
‘‘మా మంచి డాడీ’’ అంటూ ఓ ముద్దిచ్చి వెళ్లింది రిషిత. ఆనంద్ ప్రాజెక్టు వర్క్ ముందేసుకుని కూర్చున్నాడు. ఇంతలో రేఖవచ్చి ‘‘ఇదేంటీ... దాని వర్క్ మీరు చేస్తున్నారు?’’ అని అడిగింది.
‘‘నా చిట్టితల్లి చదువుకోవాలటోయ్. అందుకే హెల్ప్ చేస్తున్నా’’
‘‘చదువుకున్నాక చేసుకోమనండి లేదంటే ప్రాజెక్ట్ పూర్తిచేసి చదువు కోమనండి.’’
‘‘సర్లే. అయినా నా చిట్టితల్లికి నేను హెల్ప్ చేస్తే నీకేంటి ప్రాబ్లమ్?’’
‘‘ప్రాబ్లెమ్ కాదు, మీ గారాబంతో దాన్ని చెడగొడుతున్నారనే నా బాధ.’’
‘‘నేనేం చేశానోయ్. నా కూతురికి నేను హెల్ప్ చేయడంకూడా తప్పేనా?’’
ఇక చెప్పినా లాభంలేదనుకుని రేఖ మౌనంగా ఉండిపోయింది. కానీ తన భర్త గారాబంతో కూతురు బద్ధకస్తురాలిగా, లోకజ్ఞానం లేనిదానిలా తయారవుతుం దనే బాధ. ఏం చేయాలో తెలియట్లేలేదు. కానీ ఏదోకటి చేయాలి ఆయనకు అర్థమయ్యేలా అనుకుంది.
‘‘ఏమండీ’’ పిలిచింది రేఖ.
‘‘ఏంటండీ?’’ నవ్వుతూ అడిగాడు ఆనంద్.
‘‘పార్క్‌కు వెళ్దామా?’’
‘‘ఏంటో... ఇవ్వాళ మేడమ్ మనసు పార్క్‌కు మళ్లింది.’’
‘‘ఏదో మళ్లిందిలెండి. వస్తారా?’’
‘‘నువ్వు రమ్మంటే ఏనాడైనా రానన్నానా?’’ అని పాడుతూ బయలుదేరాడు ఆనంద్.
‘‘ఏమండీ... ఆ సీతాకోకచిలుకలు చాలా అందంగా ఉన్నాయి కదా!’’ అంది రేఖ. ‘‘సీతాకోకచిలుకలు ఎప్పుడూ అందంగానే ఉంటాయ్... నీలా’’ చిలిపిగా అన్నాడు ఆనంద్. ‘‘సరసం చాలు గానీ, అవెలా వస్తాయ్? ఎక్కడ్నుంచొస్తాయ్?’’
‘‘లార్వా, కేటర్పిల్లర్, ప్యూపా అండ్ బటర్‌ఫ్లై.’’
‘‘ఈ ప్యూపాలోంచి సీతాకోకచిలుక ఎలా వస్తుంది?’’ అంటూ ఓ మొక్కకు ఉన్న పట్టుగూడును చూపించింది రేఖ.
‘‘ఇదిగో... ఇలా’’ అంటూ ఆ పట్టుగూడును చీల్చాడు ఆనంద్. అందులోంచి కిందపడ్డ సీతాకోకచిలుక ఎగరడానికి ప్రయత్నించి ఎగరలేక అక్కడే పడి పోయింది. చివరకు చనిపోయింది.
‘‘ఆ సీతాకోకచిలుకను మీరెలా చంపేశారో అర్థం చేసుకున్నారా?’’ అడిగింది రేఖ. ‘‘నేను చంపడమేంటి? ఐ హెల్ప్డ్ టూ కమ్ అవుటాఫ్ ది కకూన్.’’ కొంచెం కోపంగా అడిగాడు ఆనంద్.
‘‘కోప్పడకుండా చెప్పేది వినండి. నల్లగా అందవికారంగా ఉండే గొంగళి పురుగు అందమైన సీతాకోక చిలుకగా మారేందుకు ఈ గూడును కట్టుకుంటుంది.
అది సీతాకోక చిలుకగా రూపాంతరం చెందాక బయటకు వచ్చేందుకు బలంగా ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో దానికి రెక్కలు వస్తాయి. ఆ రెక్కలకు శక్తి వస్తుంది. ఆ శక్తిని ప్రయోగించి పట్టు గూడును చీల్చుకుని రివ్వున ఎగురు తుంది... అందంగా ఆనందంగా.’’
‘‘అవును. ఇదంతా నాకెందుకు చెప్తున్నావ్?’’
‘‘కకూన్ లోపలున్న సీతాకోకచిలుక కష్టపడకూడదని మీరు సాయం చేశారు. దాంతో గూడును చీల్చాల్సిన అవసరం దాని రెక్కలకు లేకపోయింది. అందువల్ల అవి బలపడలేదు. అందుకే అది ఎగరలేక చనిపోయింది. తనపని తాను చేసుకోనివ్వ కుండా సాయం చేస్తే ఇలాగే ఉంటుంది.’’
‘‘యూ మీన్..’’ అంటూ ఏదో అర్థమై ఆగాడు ఆనంద్.
‘‘అవునండీ.. పిల్లలు తమపని తాము చేసుకుంటేనే పని విలువ, కష్టం, దాని ఫలితం తెలిసొస్తాయి. అన్నీ మనమే చేసిపెడితే రేపు ఏదైనా కష్టం ఎదురైనప్పుడు తట్టుకోలేరు. వాళ్ల పనులు వాళ్లు చేసుకుంటేనే అన్నీ నేర్చుకుంటారు. మానసికంగా దృఢంగా తయారవుతారు.’’
భార్య చెప్పాలనుకున్నది అర్థమైంది ఆనంద్కి. ‘‘నిజమే. సారీ అండ్ థాంక్స్’’ అంటూ రేఖ చేయి పట్టుకుని ఇంటివైపు అడుగులు వేశాడు.