గాంధీ మనవరాలికి దక్షిణాఫ్రికా అవార్డు
జోహెన్నెస్‌బర్గ్: భారత జాతిపిత మహాత్మ గాంధీ మనవరాలు ఇలా గాంధీకి దక్షిణాఫ్రికా పురస్కారం దక్కింది. 'అమాడెలాకూఫా' అవార్డుతో ఆమెను గౌరవించారు. భారత సంతతికి చెందిన సన్నీ సింగ్, మాక్ మహరాజ్‌లకు కూడా ఈ పురస్కారాన్ని ప్రకటించారు. దక్షిణాఫ్రికా మిలటరీ ఈ పురస్కారాన్ని నెలకొల్పింది. సైన్యంలో భాగం కానప్పటికి ఇలా గాంధీకి ఈ గౌరవం దక్కడం విశేషం. ఆమె చేసిన సామాజిక సేవకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
తనకు అమాడెలాకూఫా పురస్కారం దక్కడం పట్ల సన్నీ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. అవార్డులు, రివార్డులు ఆశించకుండానే 42 ఏళ్ల క్రితం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నానని సన్నీ సింగ్ ఈ సందర్భంగా తెలిపారు. వివక్షపై విజయం సాధించడమే తాము సాధించిన గొప్ప గెలుపని ఆయన వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాకు అధికార ప్రతినిధిగా ఉన్న మహరాజ్ పురస్కార ప్రదానోత్సవానికి రాలేకపోయారు.