దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం: 29 మంది మృతి
దక్షిణాఫ్రికాలోని క్వాగ్గాఫొన్టెన్ పట్టణ సమీపంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో 29 మంది ప్రయాణికులు మరణించారని పుమాలంగ్ ప్రావెన్స్ భద్రత విభాగం ప్రతినిధి జోసఫ్ మబుజా మంగళవారం జోహెన్స్‌బర్గ్‌లో వెల్లడించారు. ఆ ఘటనలో 11 మందికి గాయలైనట్లు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని క్వమలంగ్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
దక్షిణాఫ్రికా రాజధాని నగరాల్లో ఒకటైన ప్రిటోరియా నుంచి వస్తున్న బస్సును ఎదురు వస్తున్న ట్రక్ ఢీ కొన్నడంతో ఆ ప్రమాదం చోటు చేసుకుందని పేర్కొన్నారు. ఆ ప్రమాద ఘటనలో 26 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారని, క్షతగాత్రుల్లో మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించారని చెప్పారు. దాంతో మృతుల సంఖ్య 29కి చెరుకుందన్నారు. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించుకునే క్రమంలో ట్రక్ డ్రైవర్ బస్సును ఢీ కొట్టారని జోసఫ్ మబుజా వివరించారు. ఆ దుర్ఘటనలో బస్సు, ట్రక్ డ్రైవర్లు మరణించి ఉండవచ్చు అన్నారు. ప్రిటోరియా వెళ్లే రహదారిలో తరచుగా వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయని, ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రొవిన్షియల్ మినిస్టర్ సోమవారం మీడియాకు వెల్లడించారు.ఈ ఏడాది సెప్టెంబర్‌లో డర్బన్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 27 మంది మరణించగా, మార్చిలో కేప్‌టౌన్ పట్టణంలో డబుల్ డెక్కర్ బస్సు ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.