ఏమో! గుర్రం దిగీ రావచ్చు!
సొగసైన సాకీలు రచించవచ్చు.
అందమైన పల్లవులు రాసుకోవచ్చు.
అద్భుతమైన చరణాలు లిఖించవచ్చు.
మరి ఇవన్నీ సవారీ చేయాలంటే...
గుర్రం కావాలి కదా!
గజ్జెల గుర్రం కావాలి కదా!
మనయంగత్ సుబ్రహ్మణియన్ విశ్వనాథన్ మెదడులో
శతకోటి సరిగమల గుర్రాలు.
వాటిలో మనం కొన్నే విన్నాం.
మిగతా గుర్రాలు ఆయనతోనే ఎగిరిపోయాయి.
సాకీలు, పల్లవులు, చరణాలు తపస్సు చేస్తే...
ఏమో గుర్రం దిగీ రావచ్చు.
24 జూన్ 1928 - 14 జూలై 2015
►ఎమ్మెస్ విశ్వనాథన్ అంటే గ్రేట్ మ్యూజిక్ డెరైక్టర్. గ్రేట్ మేన్.
►సౌత్ ఫిల్మ్ మ్యూజిక్ ఇండస్ట్రీకే గ్రేట్ ఇన్స్పిరేషన్.
►సముద్రంలా విస్తరించిన ఎమ్మెస్వీ ప్రయాణం ఓ కన్నీటి చుక్కతో మొదలైంది.
►ఆకాశంలా ఎదిగిన ఎమ్మెస్వీ ప్రస్థానం అమావాస్యతో ప్రారంభమైంది.
►అవును...
►ఎమ్మెస్వీ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
►చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నవాడు -
►సంగీత పాఠశాల పిట్టగోడ మీద కూర్చుని సంగీతం నేర్చుకున్నవాడు -
►సినిమా హీరో కావాలని కలలు కని జూనియర్ ఆర్టిస్టు వేషానికి కూడా కొరగానివాడు -
►కేవలం 5 రూపాయల జీతానికి జూపిటర్ పిక్చర్స్ సినిమా ఆఫీసులో బాయ్‌గా పని చేసినవాడు -
►డ్రామా కంపెనీలో హార్మోనిస్టుగా ప్రతిభ చూపినవాడు -
►సినీ సంగీత ప్రపంచంలో ఓ మేరుశిఖరంలా ఎదిగాడు.
►ఆయన వెనుక ఎవ్వరూ లేరు. సరిగమ పదనిసలు... స్వయంకృషి... శ్రమ... పాండిత్యం... వ్యక్తిత్వం... పనిని ప్రేమించేగుణం... ఇవన్నీ ఎమ్మెస్వీని ఇంతెత్తున నిలబెట్టాయి.
► అసలు ఎమ్మెస్వీ ప్రాభవం గురించి చెప్పాలంటే - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పాలి. ఇళయరాజా చెప్పాలి. మద్రాసు మైలాపూర్ రోడ్లో ఎమ్ఎస్వి 5052 బ్లాక్ అంబాసిడర్ కారులో ఎమ్మెస్వీ దర్జాగా వెళ్తుంటే ఎస్పీబీ, ఇళయరాజా పారవశ్యంతో దర్శించుకుని ఇన్స్పైరయ్యేవారు. ఆయనదో శకం.
రామమూర్తితో కలిసి ‘విశ్వనాథన్ - రామమూర్తి’గా చేసిన సినిమాలు కొన్నయితే, సోలోగా పనిచేసినవి వందలు. స్టార్లు... సూపర్స్టార్లు... టాప్ డెరైక్టర్లు... పాపులర్ బేనర్లు... కొత్తా పాతా... చిన్నా పెద్దా... ఎవ్వరికైనా ఎమ్మెస్వీ మ్యూజిక్కే పెద్ద అండాదండా. ట్రెండ్లు సైతం ఎమ్మెస్వీ ముందు తలవంచాల్సిందే. కానీ ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండేవాడాయన. అదే ఆయన సక్సెస్ సీక్రెట్ కూడా. ఎమ్మెస్వీ చేసినన్ని ప్రయోగాలూ ఇంకే సంగీత దర్శకుడూ చేయలేదు. ఆ జమానాలో మిగతా సంగీత దర్శకులు కూడా డెరైక్ట్గానో, ఇన్డెరైక్ట్గానో ఆయన్ను అనుసరించనవాళ్లే... అనుకరించినవాళ్లే.
ఎమ్మెస్వీ హుషారైన మనిషి. జోకులేసే మనిషి. పని దగ్గర మాత్రం ఉగ్రనరసింహుడు. సంగతుల్లో గతి తప్పితే గాయనీ గాయకుల పని అంతేసంగతులు. మణిరత్నం ‘కణ్ణతిన్ ముత్త మిట్టాల్’ లాంటి సినిమాల్లో పాటలు పాడారు. అనేక తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు. ‘గంగా యమున సరస్వతి’ అనే టీవీ సీరియల్లో ఆయన నటించిన విషయం తమిళ, తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఇంకా గుర్తే.
ఇవాళ్టి సంగీతం ఫాస్ట్ఫుడ్లా మారిపోయిందని వాపోతుండేవారు. ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న ఆయనకు ‘పద్మ’ పురస్కారం ఒక్కటీ రాకపోవడం మన ప్రభు త్వాల అజ్ఞానానికి నిదర్శనం. అవేవీ రాకున్నా ప్రజలిచ్చిన‘మెల్లిసైమన్నర్’ (లలిత సంగీత చక్రవర్తి)గా బిరుదు చాలదూ!
సంగీతంలో ఆయన ఘనాపాఠి
- కె. విశ్వనాథ్ (ప్రముఖ సినీ దర్శకుడు)
సినీ రంగంలో ఆడియోగ్రాఫర్‌గా 1940ల చివరలోనే కెరీర్ మొదలుపెట్టడం వల్ల విశ్వనాథన్ - రామమూర్తి జంట గురించి వారి తొలి అడుగుల నుంచి తెలుసు. ఎమ్మెస్వీ సంగీతంలో నేనో తమిళ సినిమా చేయాల్సింది. ‘జెమిని’ వాసన్ గారి అల్లుడు జి.ఎస్. మణి నా దర్శకత్వంలో తమిళ సినిమా చేయాలనుకున్నారు. ప్రసిద్ధ రచయిత కణ్ణదాసన్ సాహిత్యం. ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు కానీ, ఆ మ్యూజిక్ సిట్టింగ్స్ ఇప్పటికీ తీపి గుర్తే! ఆ సినిమా కోసం 4 పాటల దాకా కంపోజింగ్ చేశాం. కె.వి. మహదేవన్‌లో, ఎమ్మెస్వీలో ఓ గొప్ప లక్షణం ఉంది. వాళ్ళు ఏ బాషలో సినిమా చేస్తారో, ఆ భాష నేటివిటీని అర్థం చేసుకొని, వాళ్ళు ఆ భాషవారేనేమో అనిపించేలా సంగీతం చేస్తారు. ఎమ్మెస్వీ హై-ఓల్టేజ్ మ్యూజిక్ డెరైక్టర్. ఆయన తాదాత్మ్యంగా కంపోజ్ చేస్తుంటే, శరీరం మొత్తం ఊగుతూ, అణువణువూ సంగీతమయంగా అనిపించేది. తమిళంలో ఎమ్జీయార్, శివాజీ స్టార్స్ అయ్యారంటే, ఎమ్మెస్వీ పాటల పాత్ర చాలా ఉంది. ఒక్కముక్కలో - వేదంలో ఘనాపాఠీలు ఉన్నట్లే, సంగీతంలో ఆయన ఘనాపాఠి.
స్వరమాధురి ఆయన విలక్షణత
- డాక్టర్ సి. నారాయణరెడ్డి (సినీ గీతరచయిత)
ఎమ్మెస్వీ మంచి పరిజ్ఞానమున్న సంగీత నిర్దేశకుడు. మాతృభాష మలయాళమైనా, తమిళనాట ప్రథమశ్రేణి సంగీత దర్శకుల్లో ఒకరిగా ఆయన నిలిచారు. అప్పట్లో జెమినీ వారు ‘ఆడబ్రతుకు’ (1965) అనే సినిమా తీశారు. దానికి విశ్వనాథన్- రామమూర్తి సంగీతం. అందులో అధికభాగం పాటలు నావే. ‘పిలిచే నా మదిలో’ పాట సుప్రసిద్ధం. ‘ఆహా అందము చిందే’ అందులోదే. ‘ప్రేమలు పెళ్ళిళ్ళు’ (’74)లో ‘ఎవరువీవు, నీ రూపమేది...’, ‘మొరటోడు’ (’77)లో ‘హే కృష్ణా! మళ్ళీ నీవే జన్మిస్తే...’ లాంటి హిట్ పాటలెన్నో ఎమ్మెస్వీ బాణీలే. మహదేవన్, ఎమ్మెస్వీ - ఒక సమయంలో చిత్రసీమను ఏలారు. ఎవరి పంథా వారిదే. ‘మామ’ మహదేవన్ మనం పాట రాసిస్తే, దానికి ట్యూన్ కట్టేవాడు. ఎమ్మెస్వీ తాను ముందు ట్యూన్ ఇచ్చేవాడు. మనం రాసిన పాటకూ ట్యూన్ కట్టేవాడు. ఎమ్మెస్వీలోని విలక్షణత - స్వరమాధురి (మెలొడీ)కి ఆయన ఇచ్చే ప్రాధాన్యం. అదే సమయంలో పాట లయాత్మకంగా ఉండాలనేవాడు. ఆయన బాగా పాడేవాడు. పాడుతూ, వినిపించేవాడు. గాయకులకు నేర్పేవాడు.
ఆ కొందరిలో... ఒకడు!
- దాసరి నారాయణరావు (ప్రముఖ దర్శకుడు)
భారతదేశంలో సంగీతంలో విద్వత్తున్న గొప్ప సంగీత దర్శకులు కొందరిలో ఎమ్మెస్ విశ్వనాథన్ ఒకరు. నా దర్శకత్వంలో వచ్చిన ‘ఓ ఆడది - ఓ మగాడు’కి ఆయన సంగీతం కూర్చారు. నేటి ప్రముఖ గాయకుడు మనో (నాగూర్‌బాబు) ఆ సినిమాలో తమ్ముడిగా ఒక ప్రధానపాత్ర చేశాడు. మనోను ఎమ్మెస్వీకి పరిచయం చేశా. మనో గొంతు విని, ఆయన కుటుంబానికున్న సంగీతానుభవాన్ని చూసి ఆయన సంతోషించారు. కొన్నాళ్ళ తరువాత తన దగ్గర మనోకు అవకాశమిచ్చారు. తమిళంలో కె. బాలచందర్ అద్భుత చిత్రం - ‘అపూర్వ రాగంగళ్’. ఆ సినిమాకు సంగీతం ఎమ్మెస్వీనే! ఆ చిత్రాన్ని తెలుగులో ‘తూర్పు - పడమర’గా నేను రీమేక్ చేసినప్పుడు, నాకు ఎప్పుడూ కాంబినేషనైన రమేశ్‌నాయుడు వైపు మొగ్గా. రమేశ్‌నాయుడు అన్నీ కొత్త బాణీలే కట్టారు. తమిళ ఒరిజినల్లోని సిట్యుయేషన్కూ, బాణీకీ భిన్నమైన సినారె రచన ‘శివరంజనీ నవరాగిణీ...’ పాట. ‘తూర్పు - పడమర’ పూర్తయ్యాక ఆ సినిమా ఎమ్మెస్వీకి చూపించా. ఆయన సినిమా, ఆ పాటలు చూసి, రమేశ్నాయుడునూ, పాడిన ఎస్పీబీనీ ఎంత అభినందించారో!
సంగీత జ్ఞానం, అభిరుచున్న జీనియస్
- రావు బాలసరస్వతి (తొలితరం సినీ గాయని)
1940ల ద్వితీయార్ధంలో సుబ్బురామన్ దగ్గర తమిళ, తెలుగుల్లో చాలా పాటలు పాడా. ఆయన దగ్గర ఎమ్మెస్వీ పియానో వాయించేవాడు. అలా చిన్న కుర్రాడిగా ఉన్నప్పటి నుంచి ఎమ్మెస్వీ నాకు తెలుసు. చిన్న వయసులోనే అతనెంత జీనియస్సో! సుబ్బురామన్ చనిపోయాక, ‘దేవదాసు’కు మిగతా ట్యూన్స్ కట్టింది ఎమ్మెస్వీనే. అందులో క్షేత్రయ్య పదం నాతో పాడించాడు. మ్యూజిక్ డెరైక్టరయ్యాక తన తొలిచిత్రం ‘మా గోపి’లో ‘ఓ ముద్దుపాపా...’ అనే లాలిపాట పాడించాడు. మనిషి పొట్టి అనే మాటే కానీ, అపారమైన తెలివి... అద్భుత సంగీత జ్ఞానం ఎమ్మెస్వీ సొంతం. ఆయనకు మంచి మ్యూజిక్ టేస్ట్. కర్ణాటక సంగీతం బాగా వచ్చు కాబట్టి, సులభంగా ట్యూన్ చేసేవాడు. ఏ ఆర్టిస్టు ఏ పాట పాడితే బాగుం టుందో గుర్తించి, వాళ్ళతో అలాంటి పాటలు పాడించేవాడు. మద్రాస్ సఫైర్ థియే టర్లో ఉదయం ఆటలతో 596 రోజులాడిన ‘మరోచరిత్ర’లో 5 పాటలూ అయిదుగురు వేర్వేరు ఫిమేల్ సింగర్స్‌తో పాడించడం ఉదాహరణ. ఎన్నో హిట్లిచ్చినా, గర్వం ఉండేది కాదు. అలాంటి మ్యూజిక్ డెరైక్టర్లు అరుదు.
ప్రతి పాటా... ఒక రత్నమే
- ఎస్. జానకి (ప్రముఖ సినీ గాయని)
తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఎమ్మెస్వీ దగ్గర ఎన్నో హిట్ పాటలు పాడా. ఒక్కో పాట ఒక్కో రత్నం. తెలుగు సరే సరి. మలయాళంలో ఆయన మ్యూజిక్‌తో నాకెంతో పేరొచ్చింది. అక్కడ పాడిన ‘ఆనిమిషత్తిండే...’, ‘వీణపూవే...’, ‘నిశీథినే...’ లాంటి పాటలను ఇవాళ్టికీ అక్కడి సినీ ప్రియులు చెప్పుకుంటారు. విచిత్రం ఏమిటంటే, మెలొడీలో ఎమ్మెస్వీ నాకు గురువు లాంటి వాడని చెప్పే ఇళయరాజా ఆ తరువాత ఎమ్మెస్వీతో కలసి ‘మెల్ల తిరందద్ కదవు’ అనే తమిళ చిత్రానికి పనిచేశారు. అందులో పాటలకు ట్యూన్స్ ఎమ్మెస్వీ కట్టారు. పాటల మధ్యలోని బీజియమ్లు ఇళయరాజా చేశారు. అందులో ‘వా వెన్నిలా...’ పాట ఇవాళ్టికీ హిట్టే. ఎమ్మెస్వీ స్వయంగా గాయకుడు. అడపాదడపా తమిళంలో పాడేవారు. ఆయనతో కలసి నేను డ్యూయెట్లు పాడా. ఆ రోజుల్లో తమిళంలో సింగర్స్ పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, సౌందరరాజన్లకు ఎమ్మెస్వీ పెద్ద హిట్స్ ఇచ్చారు. తమిళనాడు ప్రభుత్వగీతమైన తమిళ్‌తాయ్ వాళ్తు ‘నీరారుమ్ కడలుడుత్త...’కు ట్యూన్ కట్టి, సుశీల, సౌందరరాజన్‌లతో పాడించిందీ ఎమ్మెస్వీనే.
అవి ఆయన నాకిచ్చిన పెద్ద గిఫ్ట్‌లు
- ఎల్.ఆర్. ఈశ్వరి (ప్రముఖ సినీ గాయని)
కాలంతో చెరిగిపోని ఎన్నో పాటలు ఎమ్మెస్వీ చేశారు. తమిళంలో కణ్ణదాసన్, వాలి లాంటి మహా రచయితలు ఎమ్మెస్వీ బాణీకి కూర్చిన పాటల్లో మంచి విషయాలెన్నో చెప్పారు. ఇవాళ్టికీ వాటిని జనం పాడుకుంటూ తలుచు కొంటున్నారు. సంగీత దర్శకుడిగా ఆయ నెంతో శ్రమించి, సాధన చేసి పైకొచ్చారు. ఆయనలోని గొప్ప సంగతి - ఆయన పాటకు ఆయనే తొలి ఫ్యాన్. తనకూ, చుట్టూ ఉన్నవాళ్ళకీ నచ్చితేనే దర్శకుడికి ఆ ట్యూనిచ్చేవారు. ఎమ్మెస్వీ అంటే నాకు ఆరాధన. ఆయనంటే నాకు ఇష్టం. నేనంటే ఆయనకు ఇష్టం. చిన్నప్పటి నుంచీ నాకు ఆయనొక్కరే. నా 25వ ఏట నుంచి ఇప్పటి దాకా ఆయనతోనే జీవితం పంచుకున్నా. అంత పెద్ద మ్యూజిక్ డెరైక్టరైనా, ఆయనది వట్టి పసిపిల్లాడి మనస్తత్వం. ‘బలే బలే మగాడివోయ్’ (మరోచరిత్ర), ‘సన్నజాజులోయ్ కన్నెమోజు లోయ్’ (సింహబలుడు) లాంటివి ఆయన నాకిచ్చిన పెద్ద గిఫ్ట్‌లు. నెలరోజులుగా ఆస్పత్రిలో ఉంటే, చూడలేకపోయాను. ఇవాళ ఒక శకం ముగిసింది. కన్నీళ్ళు పెట్టకుండా ఆయన పాటలతోనే ఆయన అంతిమయాత్ర సాగాలి.
సినీ సంగీత హిమాలయం
- ఈరంకి శర్మ (దర్శకుడు)
బాలచందర్ గారి దగ్గర పనిచేసే రోజుల నుంచి నాకు ఎమ్మెస్వీ క్లోజ్. నేను డెరైక్ట్ చేసిన 5 తెలుగు, 3 కన్నడ చిత్రాల కూ ఆయనదే మ్యూజిక్. యద్దనపూడి నవలతో, నా డెరైక్షన్‌లో కె.ఎస్. రామారావు నిర్మించిన ‘పార్థు’ సీరియల్‌కి పాటలు, రీరికార్డింగ్ ఎమ్మెస్వీనే చేశారు. ఎన్నో వందల చిత్రాలు ఆయన చేసినా, బెస్ట్ మ్యూజిక్ డెరై క్టర్‌గా ఆయనకు బంగారు నంది వచ్చిన ఏకైక సినిమా నా డెరైక్షన్‌లోని ‘నాలాగా ఎందరో’ (1978). కల్యాణి రాగంలోని ‘కల్యాణినీ’ పాట ఇవాళ్టికీ గుర్తే. సిట్యుయే షన్ చెప్పగానే ఇన్స్పైరై ట్యూన్ చేసేవారు. రీరికార్డింగ్ మాస్టర్. ఎస్పీబీని తమిళ్లో పరిచయం చేసిందీ ఎమ్మె స్వీనే. తర్వాతి తరానికి మెలోడీ అనే కిటుకు నేర్పి, 90 శాతం హిట్లిచ్చిన సంగీత హిమాలయం నేడు ఒరిగింది.
ఆ సంగీతం... విమల గాంధర్వం
- వి.ఏ.కె. రంగారావు (సంగీత విమర్శకుడు)
విశ్వనాథన్ - రామమూర్తి కలసి సంగీతం చేసినప్పుడు ఎవరు, ఏది, ఎంత చేశారో వారికే తెలుసు. నా దృష్టిలో అది తెలుగు సినిమాలో వినిపించిన విమల గాంధర్వం. సుబ్బురామన్ పోయేవేళకు అయిదారు చిత్రాల సంగీతం మిగిలింది. అవన్నీ (ప్రజారాజ్యం, దేవదాసు, వగైరా) విశ్వనాథనే పూర్తి చేశాడు. ‘దేవదాసు’లో జగమే మాయ, క్షేత్రయ్య పదం ఇంత తెలిసియుండి.. సంగీతం ఇతనివే. అంతకు ముందూ, వెనుకా ఎవరూ క్షేత్రయ్యపదాన్ని ఇతనిలా రాగమాలికగా చేయలేదు. భానుమతి ‘చండీరాణి’కి సంగీతమూ విశ్వనాథన్‌దే. సిద్ధ గాయకులతోనే కాక, అరుదుగా పాడేవాళ్ళతో ఆ కంఠంలో ఏది అందంగా పలుకుతుందో దాన్ని పలికించిన నేర్పు విశ్వనాథన్ది.
మరపురాని మధుర సంగీత చక్రవర్తి
ఎమ్మెస్వీ తెలుగులో చాలా మంచి పాటలు స్వరపరిచారు. అన్నీ భావగర్భితాలు... రాగగర్భితాలు. ముఖ్యంగా కె. బాలచందర్ కాంబినేషన్లో ఎమ్మెస్వీ చేసిన పాటలన్నీ నేల నలుచెరగులా మార్మోగిపోయాయి. ఎమ్మెస్వీ పేరు చెప్పగానే బాగా గుర్తొచ్చే... తరచుగా పాడుకునే అనేకానేక పాటల నుంచి... ఓ ఇరవై తెలుగు పాటలతో ఆయనకు స్వరాంజలి...
► పోతే పోనీ పోరా... చిత్రం: ప్రాయశ్చిత్తం(1962)
►రేపంటి రూపం కంటి... మంచి- చెడు (1963)
► ఆహా అందము చిందే హృదయ కమలం... ఆడబ్రతుకు (1965)
► తలచినదే జరిగినదా... దైవం ఎందులకు?... మనసే మందిరం (1966)
► పిల్లలూ దేవుడూ చల్లనివారే... లేత మనసులు (1966)
► నన్ను ఎవరో తాకిరి... సత్తెకాలపు సత్తయ్య (1969)
►నా జన్మభూమి ఎంత అందమైన దేశము... సిపాయి చిన్నయ్య (1969)
►ఏమంటున్నది ఈ గాలి? మేమూ మనుషులమే (1973)
► హల్లో మైడియర్ రాంగ్ నెంబర్... మన్మథలీల (1976)
► దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి... అంతులేని కథ (1976)
► ఏ తీగ పువ్వునో... మరోచరిత్ర (1978)
► సన్నజాజులోయ్ కన్నె మోజులోయ్... సింహబలుడు (1978)
► అటు ఇటు కాని హృదయం తోటి... ఇది కథ కాదు (1979)
► మౌనమె నీ భాష ఓ మూగమనసా?... గుప్పెడు మనసు (1979)
►కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు... అందమైన అనుభవం (1979)
►రెక్కలు తొడిగి రెపరెపలాడి... చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
► సాపాటు ఎటూ లేదు... ఆకలి రాజ్యం (1981)
► అందమైన లోకమని రంగురంగులుంటాయని... తొలి కోడి కూసింది (1981)
►పల్లవించవా నా గొంతులో... కోకిలమ్మ (1983)
►ఎవ్వరిది ఈ పిలుపు?... మానసవీణ (1984)