చేతకాకుంటే నిర్వహించొద్దు
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : ‘ఇదేమి ఏర్పాట్లు.. క్యాంప్‌కు హాజరైన వారికి కనీస సౌకర్యాలు లేకపోతే ఎలా? కూర్చోవడానికి కుర్చీలు లేకపోవడం దారుణం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కనీసం తాగునీరు కూడా అందించకుంటే ఎలా? పేర్ల నమోదు కౌంటర్లు రెండే ఏర్పాటు చేస్తే ఎలా? చేతగాని పక్షంలో క్యాంప్‌లు నిర్వహించవద్దు’ అంటూ సదరన్ క్యాంప్ నిర్వహణ తీరుపై డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డిపై కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి లోపాలు జరిగే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. శుక్రవారం జిల్లా ప్రభుత్వాస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన సదరన్ క్యాంప్‌కు ఆమె ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు.
వైకల్య గుర్తింపు కోసం ఇక మీదట నెలకు మూడు క్యాంప్‌లు నిర్వహిస్తామని, దీనిని వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యాంప్‌కు హాజరైన వారికి పది మంది ప్రత్యేక వైద్య నిపుణుల తో పరీక్షలు నిర్వహించి ధ్రువపత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ క్యాంప్‌లో ఎలాంటి అనుమానాలకూ తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 30 వేలకు పైగా వివిధ రకాల పింఛన్లను అందిస్తున్నామని, మరో 500లకు పైగా అర్హులైన వికలాంగులు ఉన్నారని వీరికి పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ అందరికీ సర్టిఫికెట్లు అందించాలన్న ఉద్దేశంతోనే ఈ క్యాంప్‌ను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, డీఎంహెచ్ఓ రంగారెడ్డి, డీసీహెచ్ఎస్ మీనాకుమారి, ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, తహశీల్దార్ గోవర్ధన్, మున్సిపల్ కమీషనర్ కృష్ణారెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంగుల రవి, పట్నం సుభాష్, కసిని విక్రాంత్, శ్రీకాంత్, మందుల రాధాకృష్ణ, శివరాజ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.