సమష్టి కృషితోనే ప్రమాదాల నివారణ
కర్నూలు(రాజ్‌విహార్): రోడ్డు ప్రమాదాల నివారణకు సమష్టి కృషి అవసరం అని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. 26వ రోడ్డు భద్రతా వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక కొత్త బస్టాండ్‌లోని కర్నూలు-2 డిపో గ్యారేజీలో నిర్వహించారు. ఎస్పీ రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బస్సులు నడిపేటప్పుడు ఏకాగ్రత చాలా అవసరం అన్నారు. విధులకు హాజరయ్యే ముందు తగిన విశ్రాంతి తీసుకుంటే మానసిక ఉల్లాసం ఉంటుందని సూచించారు.
విధుల్లో ఉన్న ప్రతి డ్రైవరు తన బస్సులో ఉన్న ప్రయాణికుల సంక్షేమాన్ని మరవరాదన్నారు. తనపై 50- 60 మంది ప్రాణాలు ఆధారపడి ఉన్నాయన్న విషయాన్ని గుర్తించుకోవాలని తెలియజేశారు. ఆర్టీఓ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అజాగ్రత్త కారణంగా ప్రమాదాలు ఏర్పడితే జీవితంలో విషాదం మిగులుతుందన్నారు.
సెల్ఫోన్లో మాట్లాడుతూ బస్సులు నడపడం, అధిక వేగం, ఓవర్‌టెక్ చేడయం ప్రమాదాలకు సూచికలని వివరించారు. ఆర్టీసీ కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టరు ఎ. కోటేశ్వరరావు మాట్లాడుతూ డ్రైవర్లు, కార్మికులు మద్యపానం, గుట్కా వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం కృష్ణమోహన్, డిప్యూటి చీఫ్ మెకానికల్ ఇంజినీర్ శ్రీనివాసులు, డిప్యూటి చీఫ్ ట్రాఫిక్ మేనేజరు టి.వి. రామం, కర్నూలు-1, 2డిపోల మేనేజర్లు మనోహర్, గౌతం చటర్జీ, అసిస్టెంట్ మేనేజర్లు వెంకటయ్య, చలపతి, సుబ్రహ్మణ్యం, కార్మికులు పాల్గొన్నారు.