క్రికెట్ బెట్టింగ్‌లపై కఠినంగా వ్యవహరిస్తాం
ఏలూరు అర్బన్ : జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహించినా బుకీలుగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ హెచ్చరించారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ భాస్కర్‌భూషణ్ ప్రజలతో నేరుగా ఫోన్లో మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో అసాంఘిక చర్యలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమన్నారు. వాడపల్లి నుంచి ఫోన్ చేసిన వ్యక్తి వాడపల్లి ఇసుక ర్యాంపులో లోడింగ్ చార్జీలు విపరీతంగా వసూలు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. భీమవరం నుంచి ఫోన్ చేసిన వ్యక్తి పట్టణంలో ఆటో వాలాలు ఇష్టారాజ్యంగా విచ్చలవిడిగా నడుపుతూ ప్రమాదాలకు కారణమౌతున్నారని, వారిని నిరోధించాలని ఫిర్యాదు చేశారు. పెదపాడు నుంచి ఫోన్ చేసిన ఓ మహిళ గ్రామంలో కొందరు అక్రమంగా చీటీ పాటలు నిర్వహిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జంగారెడ్డిగూడెం నుంచి ఫోన్‌చేసిన వ్యక్తి పట్టణంలో ప్రార్థ్ధనాలయాల వద్ద పెద్ద శబ్దాలతో మైకులు ఉపయోగిస్తున్నారని, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇలా జిల్లావ్యాప్తంగా 37 మంది పలు సమస్యలకు సంబంధించి చేసిన ఫిర్యాదులపై ఎస్పీ స్పందించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.