ఫ్యాక్షన్ వర్గాలపై ప్రత్యేక నిఘా
– గొలుసు దొంగతనాలు అరికట్టేందుకు చర్యలు
– రౌడీషీటర్ల ప్రవర్తనలో మార్పు ఉంటే పేరు తొలగింపు
- ఎస్పీ అశోక్‌కుమార్
ధర్మవరం: జిల్లాలో ఫ్యాక్షన్ వర్గాలపై ప్రత్యేక నిఘా ఉంచామని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. ధర్మవరం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయాన్ని శుక్రవారం ఎస్పీ తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధర్మవరంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నందున ఇక్కడకు ఎస్ఐని కేటాయిస్తామని తెలిపారు. సిబ్బంది కొరతను తీర్చేందుకు క్రైం రేటు తక్కువగా ఉన్న స్టేషన్ల నుంచి సిబ్బందిని ధర్మవరం స్టేషన్‌కు బదిలీ చేస్తామని వివరించారు. నాటుసారా, బెల్టుషాపులు లేకుండా తమ సిబ్బంది చర్యలు చేపడుతున్నారన్నారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే 100, లేదా 9989819191 నంబర్లకు సమాచారం ఇస్తే ప్రత్యేక టీం వచ్చి బెల్టుషాపులు లేకుండా చేస్తుందన్నారు. పట్టణంలో మట్కా నిర్వాహకులను గుర్తించి వారిలో అవగాహన తీసుకొచ్చి, మట్కా రూపుమాపుతామని పేర్కొన్నారు. గొలుసు దొంగతనాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇసుక అక్రమ రవాణాను అరికడతామన్నారు. పట్టణంలో మున్సిపాలిటీ, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో అదనంగా సీసీకెమెరాలు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్‌ను ప్రజలు డౌన్లోడ్ చేసుకోవాలని, ఎవరైనా యాప్‌లో మెసేజ్ పెడితే మీ ఇంటికి సీసీకెమెరా ఏర్పాటు చేస్తామని దొంగతనాలు జరగకుండా నిఘా ఉంచుతామన్నారు. ధర్మవరానికి 7 సీసీ కెమెరాలు కేటాయించామని ఎక్కువమంది యాప్‌లో మెసేజ్ చేస్తే పోలీసు సిబ్బందితో నిఘా పెడతామని తెలిపారు. ప్రజలు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. రౌడీషీటర్ల ప్రవర్తనలో మార్పు ఉంటే వారి పేర్లను పోలీస్ రికార్డ్ల నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తామని ఎస్పీ చెప్పారు.