దొంగను.. ఇట్టే పట్టేస్తుందట..!
► మోషన్ కెమెరాలతో ఇళ్లకు రక్షణ
► ఉచితంగా నిఘానేత్రాల ఏర్పాటు
► స్మార్ట్ యాప్‌తో రిజిస్ట్రేషన్ చాలు
► జిల్లాలో ఎల్‌హెచ్‌ఎంఎస్‌కు ఆదరణ
చిత్తూరు : ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు.. ఈశ్వరుడు పట్టకపోవచ్చుగాని. పోలీసుల వద్ద ఉన్న టెక్నాలజీ ఇంటి దొంగల్ని ఇట్టే పట్టేస్తుంది. చిత్తూరుకు కొత్తగా వచ్చిన ఎస్పీ రాజశేఖర్‌బాబు ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించాలని పోలీసు శాఖను ఆదేశించారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. దొంగలబెడద లేకుండా ఎక్కడికైనా, ఎన్నిరోజులైనా ధైర్యంగా వెళ్లి రావచ్చు.
లాక్డ్ హౌస్ మేనేజన్ మెంట్ సిసస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్).. ఏడాది క్రితం అనంతపురం జిల్లాలో ప్రారంభమైన చిన్న పాటి స్మార్ట్ యాప్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. దొంగలు పడ్డ ఆర్నెళ్లకు పోలీసులు మేల్కొంటారనే నానుడిని చెరిపేస్తూ, దొంగలు రాగానే పోలీసులు పట్టుకుంటున్నారనే పేరు తీసుకురావడానికి జిల్లా పోలీసు శాఖ ప్రయత్నిస్తోంది. తాళం వేసిన ఇళ్లపై దొం గలు పడ్డ నిముషాల వ్యవధిలో వీరిని పట్టుకోవడమే లక్ష్యంగా ఎల్‌హెచ్‌ఎంఎస్ ప్రాజెక్టు పనిచేస్తోంది. ఇంతకూ ఇది ఎలా పనిచేస్తుంది..? ఎలా స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవాలి..? మనపై ఏమైనా ఆర్థిక భారం పడుతుందా..? అనే ప్రశ్నలకు చేతిలో ఓ స్మార్ట్ ఫోన్ పట్టుకుని మీరూ ఇలా ఫాలో అయిపోండి..
డౌన్ లోడ్ ఇలా...
ముందుగా స్మార్ట్ ఫోన్ నుంచి గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లాలి. ఇక్కడ ‘ఎల్‌హెచ్‌ఎంఎస్ ఏపీ పోలీస్’ అని టైప్ చేయాలి. ఏపీ పోలీస్ పేరిట ప్రత్యక్షమయ్యే ఓ అప్లికేషన్ కనిపిస్తుంది. దీన్ని ఇన్ స్టాల్ చేసుకోవాలి. తరువాత వ్యక్తి పేరు, ఫోన్ నంబరు, చిరునామాతో పాటు ఇంట్లో కూర్చుని గూగుల్ మ్యాప్‌ను అటాచ్ చేయాలి. వెంటనే మనం ఇచ్చిన ఫోన్ నంబరుకు నాలుగంకెలు ఉన్న వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) వస్తుంది. దీన్ని యాప్‌లో టైప్ చేస్తే మన రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత మన ఫోన్ కు ఓ రిజిస్ట్రేషన్ నంబరు వస్తుంది. దీన్ని ఎక్కడైనా రాసి ఉంచుకోవాలి. ఇక ఎప్పుడైనా ఊరికి వెళుతునప్పుడు పోలీసులు ఇంటిపై నిఘా ఉంచాలనుకుంటే యాప్‌లోకి వెళ్లి ‘రిక్వెస్ట్ పోలీస్ వాచ్’ ఆప్షన్ ఎంచుకోవాలి. ఎంచుకున్న తరువాత యూజర్ ఐడీ అడుగుతుంది. గతంలో సెల్‌ఫోన్ కు వచ్చిన సంఖ్యను టైప్ చేయాలి. మనం ఎప్పుడు ఊరికి వెళుతున్నాం, సమయం, తిరిగి వచ్చే తేదీ, సమయం టైప్ చేసి సబ్మిట్ వాచ్ రిక్వెస్ట్‌పై క్లిక్ చేయాలి.
ఇలా పనిచేస్తుంది..
సబ్మిట్ వాచ్ రిక్వెస్ట్ పూర్తయిన తరువాత ఇంటికి పోలీసు కానిస్టేబుల్ వస్తారు. ఇంట్లో ఆలౌట్ మిషన్ ను పోలి ఉండే ఓ మోషన్ కెమెరాను బిగించిన తరువాత మనం ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోవచ్చు. అప్పటి వరకు కెమెరా పనిచేయదు. ఎప్పుడైతే దొంగ లోనికి ప్రవేశిస్తాడో ఆ కదలికల ద్వారా కెమెరా ఆన్ అవుతుంది. ఒక్కసారి కెమెరా ఆన్ కాగానే జిల్లా ఎస్పీకి, కమాండెంట్ కంట్రోల్ గదిలో అనుసంధానం చేసిన టీవీలోకి లైవ్ ప్రత్యక్షం అవుతుంది. అలారమ్ ద్వారా బ్లూకోట్ పోలీసుల నుంచి ఎస్పీ వరకు అలెర్ట్ చేస్తుంది. ఇక నేరుగా పోలీసులు వచ్చి దొంగను పట్టుకెళుతారు. ఒక వేళ ఇంటి యజమాని సైతం దీన్ని చూడాలనుకుంటే పోలీసులు దానికి తగ్గ ఆప్షన్ ను ఇస్తారు. ఇందుకు కావాల్సిన కెమెరాలు రాష్ట్ర పోలీసు శాఖ నుంచి అందుతాయి. ప్రజలు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
20న ప్రారంభం..
జిల్లాలో ఊహించని రీతిలో ఈ యాప్‌ను 44 వేల మంది వరకు డౌన్ లోడ్ చేసుకున్నారు. చిత్తూరు నగరంలో 8 వేల మంది వరకు యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈనెల 20న ఎస్పీ రాజశేఖర్‌బాబు దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.