మట్కా, గ్యాంబ్లింగ్‌పై ప్రత్యేక దృష్టి
- ఎస్పీ రామకృష్ణ
అట్లూరుః జిల్లాలో మట్కా, గ్యాంబ్లింగ్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం అట్లూరు పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ముందుగా స్టేషన్‌లోని పరిసరాలను పరిశీలించి సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కూడా క్వాటర్సు లేక రాత్రివేళ బస్సులు రాకపోకలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 4 వేల కేసులు పెండింగులో ఉండగా 3750 కేసులు పరిష్కరించామన్నారు. సివిల్‌తో పాటు కోర్టులో ఉన్న కేసులు మాత్రమే పెండింగులో ఉన్నాయన్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. అట్లూరు మండలంలో వలసపాలెం గ్రామంలో 2013లో చంద్రగిరి నరసింహులును నరబలి ఇచ్చి చంపారని ఆకేసుకు సంబందింధించి, నల్లగొండుగారిపల్లికి చెందిన ఆటో డ్రైవర్ రామకృష్ణను హత్యచేసిన కేసుల్లో ఎటువంటి పురోగతి లేదని విలేకరులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఎస్పీ స్పందిస్తూ ఇంతవరకు నరబలి కేసు తన దృష్టికి రాలేదని ఈ కేసుపై సమగ్ర విచారణ చేసి ముద్దాయిలను పట్టుకుంటామన్నారు.