చావలేక.. బతకలేక ఉన్నాం..
నంద్యాలటౌన్: ‘‘సార్..! ఈ బతుకు పగవాళ్లకు కూడా వద్దు.. చావలేక, బతకలేక ఉన్నాం.. బతుకుదెరువు కోసం, కడుపున పుట్టిన వారిని కాపాడుకోవడానికి తప్పు చేశా.. కానీ మమ్మల్ని ఆటబొమ్మల్లా చూస్తూ వేధిస్తున్నారు. మాకురక్షణ కల్పించండి..బతుకుపై భరోసా కల్పించండి..’’ అంటూ సెక్స్ వర్కర్లు, హిజ్రాలు జిల్లా ఎస్పీ రవికృష్ణకు తమ గోడు నివేదించారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఏపీఎస్ ఏసీఎస్) ఆధ్వర్యంలో స్థానిక సాయిబాబానగర్ షాదీఖానాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తాము జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, బాధలను ఎస్పీకి హిజ్రాలు, సెక్స్‌వర్కర్లు ఆవేదనతో వివరించారు. వారి ఆవేదనపై ఎస్పీ చలించిపోయారు. రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు
పిల్లల కోసం తప్పు చేశా
భర్త దూరం కావడంతో అండగా ఉంటానని ఓ వ్యక్తి చెప్పడంతో నమ్మి మోసపోయా. తర్వాత ఇతరుల నుంచి వేధింపులకు గురయ్యాను. నేను నా పిల్లలను పోషించుకోవడానికీ, నా భర్త చేసిన అప్పును తీర్చడానికి అప్పులు చేశాను. కానీ ఇళ్ల వద్దకు వచ్చి పరువు తీస్తున్నారు. ఈ వేధింపులను భరించడం కష్టమైంది.
- చెన్నమ్మ
అడుగడుగునా వేధిస్తున్నారు
ఏ జన్మలో చేసిన పాపమోగానీ హిజ్రాను అయ్యాను. జీవనోపాధి కోసం రైళ్లల్లో భిక్షాటన చేసేదానిని. కానీ నోటికొచ్చినట్లు పిలుస్తూ, డబ్బులు ఇస్తానని లైంగికంగా వేధించేవారు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. మాకు రక్షణకల్పించండి.
- శ్రీలత, హిజ్రా
నమ్మితే మోసం చేశారు
జీవితాంతం తోడుండాల్సిన భర్త దూరంకావడంతో కుటుంబ పోషణ భారం నాపై పడింది. ఏం చేయాలో దిక్కుతోచక పిల్లలను పోషించడానికి ఈ మార్గం ఎంచుకున్నాను. కానీ ఆకతాయిలు ఇళ్ల వద్దకు వచ్చి బెదిరిస్తున్నారు. కుటుంబ సభ్యులను, కన్న బిడ్డలను అల్లరి చేస్తున్నారు. దీన్ని భరించలేకున్నాం.
- కుమారి