సంతోషంగా సంక్రాంతి
నెల్లూరు(క్రైమ్) : ప్రజలందరూ సంక్రాంతి పండగను సంతోషంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఎస్.సెంథిల్‌కుమార్ కోరా రు. పండగ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడం తగదని చెప్పారు. మంగళవారం ఆయన తనచాంబర్లో ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా కోడిపందేలు, జూదం పోటీలు జరిగే ప్రాంతాలను గుర్తించామని చెప్పారు. గతేడాది పండగ సమయాల్లో పందేలు నిర్వహిస్తూ తమ రికార్డులకెక్కిన వ్యక్తుల వివరాలను సేకరించామన్నారు.
ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా సుమారు 150 మందిని బైండోవర్ చేసుకున్నామని పేర్కొన్నారు. రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తమిళనాడు, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు చెందిన దొంగల ముఠాలు జిల్లాలో తిష్టవేశాయన్న సమాచారం ఉందన్నారు. దీంతో గస్తీని ముమ్మరం చేయడంతో పాటూ అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. పండగ వేళల్లో ఊరు విడిచి వెళ్లేవారు ముందుగా సెల్ నంబరు 9494626644కు సమాచారం మేసేజ్ రూపంలో అందిస్తే తమ సిబ్బంది ఆ ఇంటిపై ప్రత్యేక దృష్టిసారిస్తారని వివరించారు.
ఇసుక అక్రమ రవాణా విషయంలో ఇప్పటి వరకు సుమారు 280 కేసులు నమోదు చేశామని చెప్పారు. సుమారు రూ 2.79కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకోవడంతో పాటు 295 మంది నిందితులను అరెస్ట్చేశామని వెల్లడించారు. జిల్లాలో సిమి ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయని మీడియాల్లో వచ్చిన కథనాల్లో వాస్తవం లేదన్నారు. సిమి ఉగ్రవాదులు 2013లో మధ్యప్రదేశ్‌లోని ఖాండాన్ జైలు నుంచి తప్పించుకొన్నారన్నారు. వారి కోసం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గాలింపు జరుగుతుందన్నారు.