SP velumani
-
మాజీ మంత్రిపై రూ.1,500 కోట్ల కమీషన్ పొందినట్లు ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, చెన్నై: వివిధ పథకాల కింద అమలు చేయాల్సిన పనుల్లో మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి రూ.1,500 కోట్ల అవినీతికి పాల్పడినట్లు కోయంబత్తూరు ఆర్థికనేర విభాగం పోలీసులకు మంగళవారం ఫిర్యాదు అందింది. కోయంబత్తూరు రేస్‌కోర్స్ ప్రాంతానికి చెందిన డీఎంకే సభ్యుడు, సినీ నిర్మాత ‘రేస్‌కోర్స్’ రఘునాథ్ కోవై ఆర్థికనేరాల విభాగం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాలు ఇలా ఉన్నాయి. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో కోవై కార్పొరేషన్, కోవైలోని మున్సిపాలిటీల్లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి, కొందరు శాసనసభ్యులు ప్రజాధనాన్ని స్వాహా చేశారు. కోయంబత్తూరు కార్పొరేషన్లో రూ.1,500 కోట్ల అవినాశీ–అత్తికడవు పథకానికి తొలివిడతగా రూ.225 కోట్లు మంజూరై పనులు ప్రారంభమయ్యాయి. బిల్లూరు 3వ అభివృద్ధి పథకం కింద సొరంగ మార్గం నిర్మాణానికి రూ.116 కోట్ల కేటాయింపు జరిగి పనులు జరుగుతున్నాయి. నొయ్యాల్ చెరువు స్వాధీనం కోసం రూ.230 కోట్లు, కోవై నగరానికి 24 గంటల తాగునీటి సరఫరాకు రూ.550 కోట్లు, కునియముత్తూరు భూగర్భ డ్రైనేజీ పనులకు రూ.19.5 కోట్లు, ఆత్తుపాలం–ఉక్కడం ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు రూ.215.51 కోటి, కోవై రేస్‌కోర్సు స్మార్ట్ సిటీ పథకానికి తొలివిడతగా రూ.40 కోట్లు కేటాయింపు జరిగింది. ఇలా జరిగే అన్నిపనుల్లోనూ మంత్రి తనవాటాగా 12 శాతం కమీషన్ పొందడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇలా వివిధ పథకాల ముసుగులో రూ.1,500 కోట్ల వరకు అవినీతికి పాల్పడిన మాజీ మంత్రి వేలుమణిపై అవినీతి నిరోధకశాఖ ద్వారా చట్టపరమైన చర్య తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
కొత్త చిత్రాలకు 30 శాతం వినోదపు పన్ను
సాక్షి, టీ.నగర్: కార్పొరేషన్, మున్సిపాలిటీ పరిధిలోని థియేటర్లలో విడుదలయ్యే కొత్త చిత్రాలకు 30 శాతం వినోదపు పన్ను విధించాలని అసెంబ్లీలో గురువారం మంత్రి ఎస్పీ వేలుమణి ఓ చట్ట సవరణ ముసాయిదాను దాఖలు చేశారు. అందులో తమిళనాడు చలనచిత్ర ప్రతినిధులు, స్థానిక సంస్థలకు వినోదపు పన్ను విధించడంపై ఉన్న వివాదాలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారన్నారు. ఈ వ్యవహారంపై నియమించిన ప్రతినిధులతో కూడిన ఒక ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించిందన్నారు. పరిశీలించిన ప్రభుత్వం వినోదపు పన్ను వసూలు చేసేందుకు స్థానిక సంస్థల ద్వారా నియమితులైన అధికారులు పరిశీలన జరిపేలా అనుమతిచ్చే చట్ట ముసాయిదా దాఖలు చేశామన్నారు. ఈ మేరకు కార్పొరేషన్, పట్టణ పంచాయతీ పరిధి లోని థియేటర్లలో 30 శాతం వినోదపు పన్ను చెల్లించాలని, పాత చిత్రాలకు 20 శాతం వినోదపు పన్ను చెల్లించాలని అందులో పేర్కొన్నారు. -
‘కమల్’ జాగ్రత్త...!
– ఎస్పీ వేలుమణి హెచ్చరిక – రాజకీయాల్లోకి రావాలని తంబి హితవు – ఒక్క పూట మురికి వాడలో గడుపు- తిరుమావళవన్ చెన్నై: లోకనాయకుడు కమల్ హాసన్‌కు వ్యతిరేకంగా అధికార పక్షం వర్గాలు తీవ్రంగా గళం విప్పే పనిలో పడ్డారు. హద్దులు దాట వద్దని, జాగ్రత్తల్లో ఉంటే మంచిదని నగరాభివృద్ది శాఖ మంత్రి ఎస్పి వేలుమణి హెచ్చరికలు జారీ చేశారు. ఇక బయట నుంచి విమర్శలు, ఆరోపణలు గుప్పించడం కాదని, రాజకీయాల్లోకి వచ్చి చూస్తే తెలుస్తుందని కమల్‌కు అన్నాడిఎంకే ఎంపీ, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై హితవు పలికారు. బిగ్ బాస్ రియాల్టీ షో వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకు వ్యతిరేకంగా ఫిర్యాదులు హోరెత్తుతున్నాయి. కమల్‌కు వ్యతిరేకంగా గళం విప్పే వారు రోజు రోజుకు పెరుగుతున్నారు. వారి నోళ్లకు తాళం వేసే రీతిలో ఆ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న లోకనాయకుడు కమల్ రెండు రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చి ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలో ప్రభుత్వాన్ని గురి పెట్టడం పాలకుల్లో ఆగ్రహాన్ని రేపింది. రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని శాఖల్లోనూ అవినీతి తాండవం చేస్తున్నదంటూ ప్రభుత్వంపై ఆయన దుమ్మెత్తి పోయడం అన్నాడీఎంకే పాలకుల్లో ఆగ్రహాన్ని రేపుతున్నది. ఇప్పటికే ఆర్థిక మంత్రి జయకుమార్ తీవ్రంగానే స్పందించారు. శనివారం నగరాభివృద్ధి శాఖ మంత్రి ఎస్పి వేలుమణి విరుచుకు పడ్డారు. మీడయాతో ఎస్పి వేలుమణి మాట్లాడుతూ.. కమల్ ఇన్నాళ్లు తమిళనాడులోనే ఉన్నారా ? లేదా మరెక్కడైనా ఉన్నారా ? అని ఎద్దేవా చేశారు. పనిగట్టుకుని ప్రభుత్వాన్ని గురి పెట్టి ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదన్న విషయాన్ని గుర్తించుకోవాలని హితవు పలికారు. ఆధార రహిత ఆరోపణలు గుప్పించడాన్ని తీవ్రంగా ఖండించారు. వినోద పన్ను తగ్గింపు విషయంగా సినీ వర్గాలతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నదని తెలిపారు. సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు సాగుతున్న సమయంలో కమల్ వ్యాఖ్యలు తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వంలో అవినీతి తాండవం అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారని, దీనిని నిరూపించ గలరా..? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ పనితీరుకు మెచ్చి కేంద్రం సైతం అడిగిన వెంటనే నిధులు సమకూర్చుతున్నదని వివరించారు. ఏదో నోటికి వచ్చింది కదా..? అని ఆధార రహిత ఆరోపణలు చేస్తూ పోతే, తీవ్రంగా స్పందించడమే కాకుండా, కోర్టుకు లాగాల్సి ఉంటుందని హెచ్చరించారు. కమల్ ఆయన నటించిన చిత్రాలకు ఏ మేరకు పన్నులు చెల్లించారో వివరించ గలరా? తాము పరిశీలించాల్సి ఉంటుందని పరోక్షంగా హెచ్చరించారు. హద్దులు దాటి వ్యాఖ్యలు చేయడం మానుకుంటే మంచిదన్నారు. అన్నాడిఎంకే ఎంపి, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై మీడియాతో మాట్లాడుతూ.. బయట నుంచి ఏదో చెప్పాలని, ఏదో చేయాలన్నట్టుగా కమల్ వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. అందుకే తమ ప్రభుత్వాన్ని గురి పెట్టి విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారన్నారు. బయట నుంచి మాట్లాడటం కాదని, రాజకీయాల్లోకి వచ్చి చూస్తే ఆయనకు అన్ని తెలుస్తాయని హితవు పలికారు. వీసీకే నేత తిరుమావళవన్.. బిగ్ బాస్ అంటూ ఏసీ గదుల్లో గడపడం కాదు అని, ఒక్క పూట మురికి వాడలో గడిపి చూడండి అన్నీ తెలుస్తాయని హితవు పలికారు. మంత్రి ఎస్పీ వేలుమణి వ్యాఖ్యలను కమల్ అభిమానులు తీవ్రంగానే పరిగణించారు. ఆయన ఇంటి ముట్టడికి నినాదాన్ని అందుకున్నారు. ఈ వ్యవహారం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనన్నది వేచి చూడాల్సిందే. ఇక దక్షిణ భారత నటీ నటుల సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ మాట్లాడుతూ.. తామందరం కమల్ వెంటే అని వ్యాఖ్యానించడం గమనార్హం. -
అమ్మ కోసం..
► మంత్రుల నేతృత్వంలో యాగాలు ► రాష్ట్రవ్యాప్తంగా భక్తితో పూజలు ► సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థనలు సాక్షి, చెన్నై : ముఖ్యమంత్రి జయలలిత సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు సోమవారం గణపతి హోమాలు, ఆయుష్, మృత్యుంజయ యాగాలు జరిపించా రు. అన్నాడీఎంకే వర్గాలు భక్తి శ్రద్ధలతో యాగాలు, పూజల్లో లీనమయ్యారు.రాష్ట్ర ముఖ్యమంత్రి జె.జయలలిత ఆరోగ్యం మెరుగు పడడంతో ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చిన విషయం తెలిసిందే. తమ అమ్మ ఆరోగ్యం మెరుగుపడడంతో అన్నాడీఎంకే వర్గాల ఆనందానికి అవదులు లేకుండాపోయారుు. తమ అమ్మ సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా త్వరతగతిన ప్రజా సేవకు అంకితం కావాలని కాంక్షిస్తూ ఆలయాల్లో పూజల్ని హోరెత్తించే పనిలో పడ్డారు. సోమవారం రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లో యాగ, హోమాది పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మ జయలలిత పేరుతో మృత్యుంజయ యాగాలు, దీర్ఘాయుష్షు పూజలు, గణపతి హోమాలను నిర్వహించారు. చెన్నై, మైలాపూర్‌లోని కపాలీశ్వర ఆలయంలో రాష్ట్రమంత్రులు తంగమణి, ఎస్పీ వేలుమణి, కామరాజర్, సరోజ, ఎంసీ.సంపత్, దురైకన్ను, కడంబూరు రాజు, వలర్మతి, రాజలక్ష్మి, రామచంద్రన్‌ల నేతృత్వంలో మహా మృత్యుంజయ యాగం జరిగింది. వ్యాసార్పాడిలోని మరుగదాంబాల్ ఆలయంలో ఎమ్మెల్యే వెట్రివేల్ నేతృత్వంలో ఆయుష్షు, మృత్యుంజయ యాగాలు భక్తి శ్రద్ధలతో సాగారుు. పురసైవాక్కంలోని గంగాదీశ్వర ఆలయంలో మంత్రి డి.జయకుమార్, పార్టీ నేత బాలగంగా నేతృత్వంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం జరిగింది. నీలాంకరైలో అక్కడి పార్టీ వర్గాల నేతృత్వంలో 1,008 దీపాల పూజ నిర్వహించారు. అమంజికరైలోని ఏకాంబరేశ్వర ఆలయంలో మాజీ మంత్రి గోకుల ఇందిర నేతృత్వంలో గణపతి హోమం, పుదుకోటై్టలోని గోమతీశ్వరాలయంలో మాజీ ఎమ్మెల్యే కలై రాజన్ నేతృత్వంలో విశిష్ట పూజలు నిర్వహించారు. ఇక, అపోలో ఆసుపత్రి వద్దకు అన్నాడీఎంకే వర్గాల రాక పెరగడంతో పోలీసు అధికారులు మళ్లీ ఆ పరిసరాల్లో భద్రతను పెంచారు.