‘కమల్’ జాగ్రత్త...!
– ఎస్‌పీ వేలుమణి హెచ్చరిక
– రాజకీయాల్లోకి రావాలని తంబి హితవు
– ఒక్క పూట మురికి వాడలో గడుపు- తిరుమావళవన్
చెన్నై: లోకనాయకుడు కమల్ హాసన్‌కు వ్యతిరేకంగా అధికార పక్షం వర్గాలు తీవ్రంగా గళం విప్పే పనిలో పడ్డారు. హద్దులు దాట వద్దని, జాగ్రత్తల్లో ఉంటే మంచిదని నగరాభివృద్ది శాఖ మంత్రి ఎస్‌పి వేలుమణి హెచ్చరికలు జారీ చేశారు. ఇక బయట నుంచి విమర్శలు, ఆరోపణలు గుప్పించడం కాదని, రాజకీయాల్లోకి వచ్చి చూస్తే తెలుస్తుందని కమల్‌కు అన్నాడిఎంకే ఎంపీ, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై హితవు పలికారు. బిగ్ బాస్ రియాల్టీ షో వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకు వ్యతిరేకంగా ఫిర్యాదులు హోరెత్తుతున్నాయి.
కమల్‌కు వ్యతిరేకంగా గళం విప్పే వారు రోజు రోజుకు పెరుగుతున్నారు. వారి నోళ్లకు తాళం వేసే రీతిలో ఆ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న లోకనాయకుడు కమల్ రెండు రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చి ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలో ప్రభుత్వాన్ని గురి పెట్టడం పాలకుల్లో ఆగ్రహాన్ని రేపింది. రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని శాఖల్లోనూ అవినీతి తాండవం చేస్తున్నదంటూ ప్రభుత్వంపై ఆయన దుమ్మెత్తి పోయడం అన్నాడీఎంకే పాలకుల్లో ఆగ్రహాన్ని రేపుతున్నది. ఇప్పటికే ఆర్థిక మంత్రి జయకుమార్ తీవ్రంగానే స్పందించారు. శనివారం నగరాభివృద్ధి శాఖ మంత్రి ఎస్‌పి వేలుమణి విరుచుకు పడ్డారు.
మీడయాతో ఎస్‌పి వేలుమణి మాట్లాడుతూ.. కమల్ ఇన్నాళ్లు తమిళనాడులోనే ఉన్నారా ? లేదా మరెక్కడైనా ఉన్నారా ? అని ఎద్దేవా చేశారు. పనిగట్టుకుని ప్రభుత్వాన్ని గురి పెట్టి ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదన్న విషయాన్ని గుర్తించుకోవాలని హితవు పలికారు. ఆధార రహిత ఆరోపణలు గుప్పించడాన్ని తీవ్రంగా ఖండించారు. వినోద పన్ను తగ్గింపు విషయంగా సినీ వర్గాలతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నదని తెలిపారు. సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు సాగుతున్న సమయంలో కమల్ వ్యాఖ్యలు తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వంలో అవినీతి తాండవం అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారని, దీనిని నిరూపించ గలరా..? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ పనితీరుకు మెచ్చి కేంద్రం సైతం అడిగిన వెంటనే నిధులు సమకూర్చుతున్నదని వివరించారు. ఏదో నోటికి వచ్చింది కదా..? అని ఆధార రహిత ఆరోపణలు చేస్తూ పోతే, తీవ్రంగా స్పందించడమే కాకుండా, కోర్టుకు లాగాల్సి ఉంటుందని హెచ్చరించారు. కమల్ ఆయన నటించిన చిత్రాలకు ఏ మేరకు పన్నులు చెల్లించారో వివరించ గలరా? తాము పరిశీలించాల్సి ఉంటుందని పరోక్షంగా హెచ్చరించారు. హద్దులు దాటి వ్యాఖ్యలు చేయడం మానుకుంటే మంచిదన్నారు.
అన్నాడిఎంకే ఎంపి, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై మీడియాతో మాట్లాడుతూ.. బయట నుంచి ఏదో చెప్పాలని, ఏదో చేయాలన్నట్టుగా కమల్ వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. అందుకే తమ ప్రభుత్వాన్ని గురి పెట్టి విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారన్నారు. బయట నుంచి మాట్లాడటం కాదని, రాజకీయాల్లోకి వచ్చి చూస్తే ఆయనకు అన్ని తెలుస్తాయని హితవు పలికారు. వీసీకే నేత తిరుమావళవన్.. బిగ్ బాస్ అంటూ ఏసీ గదుల్లో గడపడం కాదు అని, ఒక్క పూట మురికి వాడలో గడిపి చూడండి అన్నీ తెలుస్తాయని హితవు పలికారు. మంత్రి ఎస్‌పీ వేలుమణి వ్యాఖ్యలను కమల్ అభిమానులు తీవ్రంగానే పరిగణించారు. ఆయన ఇంటి ముట్టడికి నినాదాన్ని అందుకున్నారు. ఈ వ్యవహారం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనన్నది వేచి చూడాల్సిందే. ఇక దక్షిణ భారత నటీ నటుల సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ మాట్లాడుతూ.. తామందరం కమల్ వెంటే అని వ్యాఖ్యానించడం గమనార్హం.