మళ్లీతప్పించారు
సాక్షి, సంగారెడ్డి: ఆంధ్రప్రవేశ్ పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్(డీఎం) పోస్టు వ్యవహారం కుర్చీలాటను తలపిస్తోంది. డీఎంగా ఓ అధికారిని నియమించి నెల రోజులూ గడవక ముందే ఆ అధికారిని తప్పించడానికి మరో అధికారిని నియమించడం అధికారవర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. సంస్థ రాష్ట్ర కార్యాలయంలో ఏఎంగా పనిచేసిన జె. జయరాం పదోన్నతిపై మెదక్ డీఎంగా ఈ నెల 5న బాధ్యతలు స్వీకరించారు. ఆయన విధుల్లో చేరి 20 రోజులకే ఎస్. పద్మాకర్ అనే మరో అధికారిని డిప్యుటేషన్‌పై డీఎంగా నియమిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే కలెక్టర్‌కు రిపోర్టు చేయాలని రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ హోదా కలిగిన పద్మాకర్‌ను ఆదేశించారు.
నాటకీయ పరిణామాలు
సంస్థ డీఎం కార్యాలయం అసిస్టెంట్ మేనేజర్ ఎ. సత్యనారాయణ సహోద్యోగి నుంచే రూ. 1.25 లక్షల లంచం తీసుకుంటూ గత సెప్టెంబర్ 16న ఏసీబీకి దొరికిపోయారు. సంస్థలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు చర్చనీయాంశమయ్యాయి. దీంతో అప్పటి డీఎం ప్రసాద్ ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే బదిలీ చేయించుకుని వెళ్లిపోవడంతో పోస్టు ఖాళీ అయింది. పౌర సరఫరాల శాఖ అధికారి(డీఎస్ఓ) ఏసురత్నం కొంతకాలం, ఫారెస్టు సెటిల్మెంట్ అధికారి సాయిలు మరికొంత కాలం ఇన్చార్జి డీఎంగా బాధ్యతలు నిర్వహించారు. ఇ. రవికుమార్ అనే అధికారి గత నెల 4న డీఎంగా బాధ్యతలు స్వీకరించగా.. అదే రోజు కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆయన్ని వెనక్కి పంపించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. శ్రీనివాస్‌రెడ్డి అనే డిప్యూటీ కలెక్టర్‌కు సంస్థ డీఎంగా నియమించాలని ఆమె ప్రభుత్వానికి లేఖ రాసినట్లు అధికారుల్లో చర్చ జరిగింది. అయితే, కలెక్టర్ సిఫారసులను బేఖాతర్ చేస్తూ.. పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర కార్యాలయం జె. జయరాంను డీఎంగా నియమించింది. ఇది జరిగిన 20 రోజులకే మరో ఎస్. పద్మాకర్‌ను నియమించడంతో అధికారుల్లో చర్చనీయాంశమైంది.