స్కూల్ బస్సూ అత్యవసర సర్వీసే
అడ్డుతొలగి దారి ఇవ్వండి
చెరువుల ఆక్రమణలు తొలగిస్తాం
తెలుగుగంగపై ప్రత్యేక దృష్టి సారిస్తాం
అంగన్వాడీలకు భవనాలు నిర్మిస్తాం
కలెక్టర్ సిద్ధార్థ జైన్ వెల్లడి
శ్రీకాళహస్తి: అంబులెన్స్, అగ్నిమాపక వాహనం, 108 వలే పాఠశాల, కళాశాల బస్సులను అత్యవసరసేవలు నిర్వహించే వాహనంగా భావించి ఆ వాహనాలకు అడ్డు తప్పుకోవాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ అన్నారు. పట్టణంలోని తెలుగుగంగ అతిథి భవనంలో అన్నిశాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వివరాలను ఆ తర్వాత తహశీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ విలేకరుల సమావేశంలో వివరించారు.
స్కూల్ బస్సులు, ఆటోల కండిషన్‌పై తనిఖీ లు చేయాలని డీటీసీ బసిరెడ్డికి ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. అధికారుల సమావేశానికి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు. మెదక్జిల్లాలో జరిగిన దుర్ఘటన బాధాకరమన్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జిల్లాలో చెరువులు ఆక్రమించారనే ఫిర్యాదులు అందాయని చెప్పారు. చెరువులను పూర్తిగా సర్వేచేయించి ఆక్రమణలు తొలగించి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.
తెలుగుగంగ కాలువకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న చిన్నచిన్న కట్టడాలు పూర్తి చేయించి రైతులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేశారు. మధ్యాహ్న భోజనం నిర్వాహకుల భత్యం కోసం 11కోట్ల రూపాయలు విడుదల చేశారని చెప్పారు. జిల్లాలో మధ్యాహ్నం భోజనంపై ప్రత్యేక దృష్టి సారి స్తామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం కల్పిస్తామని చెప్పారు. పాఠశాలల్లో తాగునీటి వసతి కల్పిస్తామని, మరుగుదొడ్లు వాడుకలోకి తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అంగన్వాడీ పాఠశాలలకు పక్కాభవనాలు నిర్మిస్తామని స్పష్టం చేశారు. వికలాంగుల అవసరాల కోసం ప్రత్యేక నిఘాపెడతామని తెలిపారు. జిల్లాలోని పలు పట్టణాల్లో అధ్వానంగా ఉన్న ట్రాఫిక్ వ్యవస్థను బాగుచేస్తామన్నారు. ప్రయా ణికులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఆయనతో పాటు జిల్లా డీపీఆర్వో లీలావతి ఉన్నారు.