సీమాంధ్రుల భద్రతకు ప్రత్యేక చట్టం!
* టాస్క్‌ఫోర్స్‌కు కొందరు ఐపీఎస్‌ల సూచన
* ఉగ్రవాదం, తీవ్రవాదం, తీరప్రాంత భద్రతపై చర్చ
* పారిశ్రామిక, ఐటీ రంగాల ప్రముఖుల అభిప్రాయాల సేకరణ
* సీఎస్ మహంతితో విజయ్‌కుమార్ భేటీ
* ముగిసిన టాస్క్‌ఫోర్స్ బృందం పర్యటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో సీమాంధ్రుల భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకురావలసిన అవసరం ఉందని కొందరు ఐపీఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వం నియమించిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) బృందానికి నివేదించారు. ఇక్కడ శాంతిభద్రతలు ఢిల్లీ తరహాలోనే కేంద్ర హోంశాఖ పరిధిలో ఉండటమే మంచిదని ఎక్కువమంది అభిప్రాయపడినట్లు సమాచారం. సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, రిటైర్డు పోలీసు అధికారులతో ఎస్టీఎఫ్ బృందం చర్చలు గురువారంతో ముగిసాయి.
ఎస్టీఎఫ్కు నేతృత్వం వహిస్తున్న కె.విజయ్‌కుమార్ సచివాలయానికి వచ్చి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతిని కలిశారు. పోలీసుశాఖకు సంబంధించిన వ్యవహారాలతోపాటు రాష్ట్ర విభజన తరువాత రెండురాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై ఆయన సీఎస్‌తో మాట్లాడినట్లు సమాచారం. అనంతరం హోంశాఖ ఉన్నతాధికారులతో కూడా భేటీ అయ్యారు.
మరోవైపు సీఆర్పీఎఫ్ ఐజీ కార్యాలయంలో మూడోరోజు జరిగిన సమావేశంలో డీజీపీ బి.ప్రసాదరావు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎం.మహేందర్‌రెడ్డి, వివిధ పోలీసు విభాగాల చీఫ్‌లు పాల్గొన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఏ రాష్ట్ర గవర్నర్ పరిధిలో పనిచేయాలనేది కూడా ఇరురాష్ట్రాల వారితో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకోవాలని అధికారులు సూచించారు.
రాష్ట్ర విభజన తరువాత ఉగ్రవాద, తీవ్రవాద సమస్యలను అధిగమించేందుకు పోలీసుశాఖలు మరింత పటిష్టంగా ఉండేందుకు తీసుకోవలసిన చర్యలపై ఎస్ఐబీ, కౌంటర్ ఇంటెలిజెన్స్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల అధికారులు నివేదిక సమర్పించారు. మాజీ పోలీసు ఉన్నతాధికారులు కూడా తమ అభిప్రాయాలను నివేదించారు. కొందరు సీనియర్ అధికారుల వద్దకు వెళ్లి కూడా ఎస్టీఎఫ్ బృందం సభ్యులు అభిప్రాయాలు సేకరించారు.
పరిశ్రమలకు సెక్యూరిటీ ముఖ్యం
రాజధాని నగరంలో పరిశ్రమలు, ఐటీ రంగ భద్రతపై కూడా ఎస్టీఎఫ్ బృందం అభిప్రాయాలను సేకరించింది. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) ఏపీ చాప్టర్ మాజీ చైర్మన్ హరీష్‌చంద్రప్రసాద్, ఇన్ఫోటెక్ చైర్మన్, సీఎండీ బీవీఆర్ మోహన్‌రెడ్డి తదితరులు బృందాలుగా వెళ్లి ఎస్టీఎఫ్ సభ్యులతో చర్చించారు. రాష్ట్ర విభజన జరిగి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ప్రకటిస్తే భద్రత ఎలా ఉండాలి? రెండు రాష్ట్రాలూ రెండు వేర్వేరు రాజధానులు ఏర్పాటుచేసుకుంటే హైదరాబాద్‌లో పరిశ్రమల భద్రత ఎలా ఉండాలి? అనే అంశాలకు సంబంధించి కూలంకుషంగా నివేదికలు సమర్పించారు. రాష్ట్ర విభజన జరగకపోతే అందుకు అనుగుణంగా కూడా హైదరాబాద్, నగర పరిసరాలలో పరిశ్రమల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవలసి ఉందని కొందరు పరిశ్రమల ప్రతినిధులు సూచించారు.
చిన్న పట్టణాల భద్రతపైనా చర్చించాం: విజయ్‌కుమార్
రెండు రాష్ట్రాలలో చిన్న పట్టణాల భద్రతపై కూడా సీనియర్ అధికారులు, నిపుణుల నుంచి సూచనలు తీసుకున్నట్లు విజయ్‌కుమార్ మీడియాకు వెల్లడించారు. కోస్తా తీరప్రాంత భద్రతపై కూడా చర్చించినట్లు తెలిపారు. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించామని, సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిందని ప్రకటించారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. శాంతిభద్రతలపై అన్ని కోణాలలో సమాచారాన్ని సేకరించామన్నారు. విభజన నేపథ్యంలో పోలీసుశాఖ ఆస్తుల పంపకం, శిక్షణ సంస్థల నిర్మాణం వంటి అంశాలపై సమావేశాలలో చర్చించామని తెలిపారు.