నకిలీ ఖాకీల నేరాలు
నెల్లూరు(క్రైమ్) : జిల్లాలో దొంగ ఎవరో..దొర ఎవరో తెలియని పరిస్థితి నెలకొంది. ఎవరిని నమ్మాలో..ఎవరిని నమ్మకూడదో అంతుపట్టని పరిస్థితి. స్థానింగా ఉన్న దొంగలతో పాటు పొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఇక్కడే తిష్టవేశారు. ఎప్పటికప్పుడు తమ పంథాను మార్చుకుంటూ పక్కా ప్రణాళికలతో జనాన్ని దోచుకుంటున్నారు. పోలీసుల అవతారం ఎత్తి దొరికినంత దోచుకెళుతున్నారు. ఒక్కోసారి జాగ్రత్తలు చెబుతూ.. మరోసారి బెదిరిస్తూ తమ దందా కొనసాగిస్తున్నారు. ఎత్తుగా, ధృడంగా ఉండే వ్యక్తులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిర్మానుష్య ప్రదేశాల్లో మాటేస్తున్నారు. ఒంటరిగా వెళ్లే మహిళలే వీరి టార్గెట్.
స్పెషల్ వింగ్ పోలీసులమని వారితో మాటలు కలుపుతారు. వీధుల్లో తిరిగేటప్పుడు ఆభరణాలు ధరించ వద్దని సలహాలు ఇస్తారు. ఇంతలో ఆ ముఠాకే చెందిన వ్యక్తి బంగారు గొలుసు ధరించి అటుగా వెళుతున్నట్లు నటిస్తాడు. అతడిని ఆపి అదే సలహా ఇవ్వడంతో పాటు బంగారు గొలుసును తీసి ఓ ప్యాకెట్లో మూట కట్టి తిరిగి అప్పగిస్తారు. మీరు కూడా ఇవ్వండంటూ మహిళలకు సూచిస్తారు. ఇదంతా నిజమేనని నమ్మిన అమాయకులు తమ ఒంటిపై నగలు వారికి అప్పగిస్తున్నారు. క్షణాల్లోనే వారిని మాయచేసి బంగారుకు బదులు రాళ్లు, చిత్తుకాగితాలు మూట కట్టి తిరిగి ఇస్తారు. ఇంటికెళ్లి చూసుకున్నాక మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. ఇలాంటి సంఘటనలే ఈ ఏడాదిలో జిల్లాలో ఇప్పటి వరకు పదికి పైగా జరిగాయి. ఇప్పటికైనా పోలీసులు ఇలాంటి ముఠాలపై నిఘా ఉంచడం, ప్రజలను ఇలాంటి ముఠాల బారిన పడకుండా అప్రమత్తం చేసే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు
- జనవరిలో బాలాజీనగర్‌లోని వైకేఆచారీ స్కూల్ వద్ద కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డుకు చెందిన విశ్రాంత అధ్యాపకురాలి నుంచి 11 సవర్ల బంగారు నగలు అపహరించారు.
- కనకమహల్ సెంటర్ సమీపంలో పాల వ్యాపారి ఎస్కే హుస్సేన్‌ను బెదిరించి రూ.20 వేల నగదు, సెల్‌ఫోన్ లాక్కెళ్లారు.
- ఏప్రిల్‌లో రంగనాయకులపేటలోని ఓ ఆస్పత్రికి వెళుతున్న అల్లీపురానికి చెందిన నాగభూషణమ్మ నుంచి సుమారు నాలుగు సవర్ల బంగారు ఆభరణాలు దోచుకున్నారు.
- గత నెల 14వ తేదీన తోటపల్లిగూడూ రు మండలం కోడూరు బీచ్‌లో ఇద్ద రు యువకులను విచారణ పేరుతో బెదిరించి రూ. 2 వేలు దోచేశారు.
- ఇరవై రోజుల క్రితం నెల్లూరులోని కొండాయపాళెం గేటు ప్రాంతంలో రేషన్ దుకాణానికి వెళుతున్న వృద్ధురాలు వనమ్మను మోసం చేసి 5 సవ ర్ల ఆభరణాలు ఎత్తుకెళ్లారు.
- గత మంగళవారం ఉదయం గంజాం రమణమ్మ (67) తన బంధువులు ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా రామ్మూర్తినగర్లోని వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద ఇద్ద రు దుండగులు తాము పోలీసులమం టూ ఆమె వద్దనున్న 9 సవర్ల బంగారు ఆభరణాలు అపహరించుకుని వెళ్లారు.
- అదే రోజు కావలిలోనూ ఓ మహిళను మోసం చేసి నగలు ఎత్తుకెళ్లారు.