సబ్‌ప్లాన్ నిధుల ఖర్చుకు ప్లాన్!
నీటి పారుదల శాఖ పరిధిలోని టీఎస్పీ నిధుల ఖర్చుకు కసరత్తు
మోడికుంటవాగు, కొమరంభీం, చెల్మలవాగు అభివృద్ధికి నిర్ణయం
హైదరాబాద్: సాగునీటి రంగ బడ్జెట్లో గిరిజన తెగల ఉప ప్రణాళిక(టీఎస్పీ)కు కేటాయించిన నిధుల వినియోగించుకోవడంపై నీటి పారుదల శాఖ దృష్టి పెట్టింది. సుమారు రూ.230 కోట్ల నిధులతో ఆయా ప్రాజెక్టుల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందిస్తోంది. గిరిజన తెగల ఆయకట్టుదారులకు సాగునీటి సదుపాయాలను కల్పించడానికి 2013లో టీఎస్పీ చట్టాన్ని తెచ్చారు. ఈమేరకు చిన్నతరహా సాగునీటి బడ్జెట్ మొత్తంలో కనీసం 6.6 శాతం రాష్ట్ర ప్రణాళికా వ్యయం టీఎస్పీకి కేటాయించాలి.
ఈ నిధులను అదే ఆర్థిక సంవత్సరంలో ప్రతి పాదించిన కొత్త పథకాలకు, కొనసాగుతున్న పథకాలకు నోడల్ ఏజెన్సీల ద్వారా రాష్ట్ర మండలి ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నిధులతో పునరుద్ధరణ, మరమ్మతులు, కొత్త చెరువుల నిర్మాణం చేసుకునే అవకాశం ఉంది. ప్రతిపాదిత ప్రాజెక్టు కింద సుమారు 40 శాతం మంది గిరిజనులు ఉంటేనే టీఎస్పీ నిధులను వినియోగించాల్సి ఉంటుంది. 2014-15లో కేటాయించిన అంచనా బడ్జెట్ రూ.368.56 కోట్లు కాగా, ఇందులో మార్చి వరకు వ్యయం చేసింది కేవలం 18.66 కోట్లు మాత్రమే.
ఈ ఏడాది భారీ అంచనాలు
ఈ ఏడాది బడ్జెట్లో టీఎస్పీ కింద అంచనా వేసిన రూ.230 కోట్ల నిధులను గిరిజనులు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోని కొమరంభీం, చెల్మల వాగు, ఖమ్మం జిల్లాలోని మోడికుంటవాగుల కింద పనులకు వెచ్చించాలని నిర్ణయించారు. 45 వేల ఎకరాల ఆయకట్టున్న కొమరం భీం ప్రాజెక్టు కింద కాల్వల మరమ్మతులు, చిన్న నీటి వనరుల అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 13 వేల ఎకరాలున్న మోడికుంటవాగు కింద 3 టీఎంసీల మేర నీటిని వినియోగించుకొని 12 వేల జనాభాకు తాగునీటిని అందించే అవకాశం సైతం ఉంది. ఈ ప్రాజెక్టుకు మొత్తంగా 125 కోట్లు అవసరం కాగా 65 కోట్ల మేర వ్యయం చేశారు. చెల్మల వాగు ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.20 కోట్ల మేర ఖర్చు కానుండగా, టీఎస్పీ నిధులను వెచ్చించేలా ప్రతిపాదనలు రూపొందించారు.