తగ్గింపు చార్జీలపై సమీక్ష: స్పైస్‌జెట్
న్యూఢిల్లీ: డిమాండ్‌ను పెంచడానికి అనుసరిస్తున్న తగ్గింపు చార్జీల వ్యూహాన్ని సమీక్షించి, దానిని కొనసాగించాలో, వద్దో నిర్ణయిస్తామని స్పైస్‌జెట్ కొత్త ప్రమోటర్ అజయ్ సింగ్ తెలిపారు. డిమాండ్‌ను పెంచడంలో ఈ వ్యూహం విజయవంతమైతే పర్వాలేదని, కానీ ఈ ఆఫర్ల వల్ల కంపెనీ ఆదాయం తగ్గకూడదని ఆయన అన్నారు. స్పైస్‌జెట్ నిర్వహణ కోసం అనుభవజ్ఞులైన వారిని తీసుకుంటామని చెప్పారు. 2013, జూలైలో అప్పటి సీఈఓ నీల్ మిల్స్ స్పైస్‌జెట్‌ను వీడివెళ్లారు.
ఈ కంపెనీకి ఇప్పుడు పూర్తిస్థాయి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కూడా లేడు. కంపెనీని వీడి వెళ్లిన వాళ్లు మళ్లీ తిరిగి వస్తామంటే పరిశీలిస్తామని అజయ్ సింగ్ తెలిపారు.
రెండు నెలల్లో రుణాలు తీర్చేస్తాం
స్పైస్‌జెట్ పునరుద్ధరణ కోసం అజయ్ సింగ్ రూ.1,500 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన రూ.500 కోట్లు నిధులందించారు. ఈ నిధులతో కంపెనీ బకాయిలను చెల్లిస్తామని, కొంత మొత్తాన్ని విస్తరణ కోసం వెచ్చిస్తామని చెప్పారు. ముందుగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలకు ప్రాధాన్యత ఇస్తామని వివరించారు. వచ్చే రెండు నెలల్లో అందనున్న నిధులతో మిగిలిన రుణాలన్నింటినీ తీర్చేస్తామని పేర్కొన్నారు. సాధారణంగా చలికాలంతో పోల్చితే ఎండాకాలంలో ఎక్కువ విమాన సర్వీసులను నిర్వహిస్తామని, ఈ ఎక్కువ విమాన సర్వీసుల నిర్వహణకు తగినంత సిబ్బంది ఉన్నారని వివరించారు. ఈ ఎండాకాలంలో 280 విమాన సర్వీసులను నిర్వహించాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు.